మహాభారతం అవలోకనంతోనే మనిషికి సార్థకత
కరీంనగర్‌కల్చరల్: మహాభారతం సారాంశాన్ని అవలోకనం చేసుకున్నప్పుడే మనిషికి సార్థకత లభిస్తుందని బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఆదివారం గాంధీరోడ్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభించి ప్రవచనాలు చేశారు. 18 పర్వములతో భగవాన్ వేదవ్యాస మహర్షి స్వరపరిచిన సంక్లిష్టమైన ఇతిహాసం విన్నవారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుందన్నారు. అంతకముందు బండ సత్తన్న ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, విష్ణు సహస్ర పారాయణం జరిగింది. శ్వేత తపస్వి డాన్స్ అకాడమీ హుజూరాబాద్ వారి నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో చైర్మన్ నలుమాచు మనోహర్, నలుమాచు సుదర్శనం, రాచర్ల వెంకటేశం, నలుమాచు చంద్రశేఖర్, కొండ రమేశ్, పాత హరిప్రసాద్, విశ్వనాథుల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
మాదిగల మహా ప్రదర్శనకు మద్దతునిద్దాం
కరీంనగర్: ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని మందకృష్ణ మాదిగ సారథ్యంలో 30 ఏళ్లుగా పోరాటం జరుగుతోందిని, అది న్యాయబద్ధమైన పోరాటమని బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వెంటనే అమలు చేయాలని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ గురించి జరిగిన ఉద్యమంలో ఎందరో వీరమరణం చెందారని, వారి త్యాగం వృథా కాదని త్వరలో వర్గీకరణ అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి, రచయిత మోహన్ బైరాగి మాట్లాడుతూ, వర్గీకరణ అనేది ప్రజాస్వామికమైన హక్కు అని దానిని వెంటనే అమలు చేయాలన్నారు. అణగారిన మాదిగ, మాదిగ ఉపకులాల బతుకుల్లో వెలుగులు నింపాలని పేర్కొన్నారు. వ ర్గీకరణకు అడ్డుపడుతున్న వారు ఇకనైనా ఆలో చించుకొని మాదిగలకు మద్దతు పలకాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బెజ్జంకి అనిల్, తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు కవ్వంపల్లి’
తిమ్మాపూర్(మానకొండూర్): రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రికార్డు పొందారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని కొత్తపల్లిలో ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రావుల రమేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు ప్రజలు ఓట్లు వేసి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో త్వరలో అతిపెద్ద స్కాం జరగబోతోందని ఆరోపించారు. రూ.10 వేలు ఇస్తే రేషన్ కార్డు, రూ.50 వేలు ఇస్తే ఇల్లు మంజూరు చేసేలా ఇందిరమ్మ కమిటీలకు ఇప్పటికే ఆదేశాలు అందాయన్నారు. ఇళ్లు లేని వారి నుంచి ఇప్పటికే నాలుగైదు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారని, అన్నిసార్లు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకష్ణారావు, నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి 24వ వరకు సైదాబాద్ రైల్వే గేట్ మూసివేత
జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని జమ్మికుంట, బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్‌ల మధ్య సైదాబాద్ గ్రామంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 23 వద్ద మరమ్మతుల కారణంగా నాలుగు రోజులు గేట్‌ను మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సైదాబాద్, శాయంపేట గ్రామాల మధ్య రహదారిపై ఈ నెల 20 నుంచి 24 వరకు రాకపోకలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment