చేగుర్తి సాండ్‌టాక్సీకి బ్రేక్
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆధిపత్య పోరుతో వివాదం ● ఇటీవల మంత్రి ప్రభాకర్‌ను కలిసిన ట్రాక్టర్ యజమానులు
కరీంనగర్‌రూరల్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చేగుర్తిలో అమలు చేస్తున్న సాండ్‌టాక్సీ విధానాన్ని నిలిపివేయడంతో ట్రాక్టర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరుతో సాండ్‌టాక్సీని రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. మూడు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ట్రాక్టర్ యజమానులు కలిసి సాండ్ టాక్సీ రద్దు చేశారని, తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్లక్రితం కరీంనగర్ మండలం చేగుర్తి, బొమ్మకల్‌లోని మానేరువాగు నుంచి ఇసుక రవాణా చేసేందుకు మన ఇసుక– మన వాహనం పేరిట సాండ్‌టాక్సీ విధానం అమలు చేశారు. ఆయా గ్రామాల్లోని క్వారీ నుంచి ఇసుక రవాణా చేసేందుకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా వినియోగదారులకు ఇసుకను రవాణా చేశారు. బొమ్మకల్‌క్వారీలో ఇసుక లేకపోవడంతో ఆర్నేళ్లనుంచి ఆన్‌లైన్ బుకింగ్ నిలిపివేయగా కేవలం చేగుర్తి క్వారీ ద్వారానే ఇసుక రవాణా జరుగుతోంది.
మంత్రిని కలిసిన ట్రాక్టర్ యజమానులు
చేగుర్తి క్వారీ నుంచిమొత్తం 80 ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తుండగా స్థానికులవి 50వరకు ఉన్నాయి. ట్రాక్టర్ యజమానులందరూ ఎక్కువగా బీఆర్‌ఎస్‌కు చెందినవాళ్లే ఉండగా కాంగ్రెస్ నాయకులు ఇసుక రవాణాలో జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల నడుమ వివాదమేర్పడింది. నెలరోజుల క్రితం సాండ్‌టాక్సీ విధానాన్ని ఆకస్మికంగా నిలిపివేశారు. ఆన్‌లైన్ బుకింగ్ లేకపోవడంతో ఉపాధి కోల్పోయిన పలువురు ట్రాక్టర్ యజమానులు ఈ నెల 14న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. కొంతమంది నాయకుల తప్పుడు సమాచారం మేరకు సాండ్‌టాక్సీ రద్దు చేశారని చెప్పడంతో ట్రాక్టర్ యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 70మంది ట్రాక్టర్ యజమానులతోపాటు 400 మంది డ్రైవర్లు, కూలీలు ఉపాధి కోల్పోయారని, సాండ్‌టాక్సీ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సాండ్‌టాక్సీ రద్దు వ్యవహారం గ్రామంలో రెండు వర్గాల నడుమ ఆధిపత్య పోరుకు దారితీసింది. సాండ్‌టాక్సీ నిలిపివేయడంపై వివరణ కోసం సంబంధిత మైనింగ్ ఏడీకి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment