నగరంలో వర్షం కురుస్తున్నప్పటి దృశ్యం
రాయచూరు రూరల్: నగరంలో గురువారం సాయంత్రం జడి వాన కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదమయంగా మారాయి. మున్నూరు వాడి, గాంధీ చౌక్, అరబ్ కాలనీల్లో కురిసిన వర్షంతో జనం ఉపశమనం పొందగా, విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
బ్రతికుండగానే చంపేశారు
● అధికారుల అత్యుత్సాహం
రాయచూరు రూరల్: మరణించిన వారి పేరిట మరణ ప్రమాణపత్రం ఇవ్వకుండా బ్రతికున్న వారి పేరిట అందించి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చడచణ తాలూకా దేవర నింబరగిలో సావిత్రి(60) అనే మహిళ చడచణ జనన మరణాల శాఖాధికారులకు తన తల్లి 12.3.2001లో మరణించినట్లు మరణ ప్రమాణపత్రమివ్వాలని దరఖాస్తు చేసుకుంది. అయితే అధికారులు సావిత్రి మరణించినట్లు మరణ ప్రమాణపత్రాన్ని ఇవ్వడంతో ఆమె అవాక్కయింది. హొన్నళ్లికి చెందిన వృద్ధురాలైన తన తల్లి మరణించడంతో 12 ఎకరాల భూమిని తన పేరిట రిజిస్టర్ చేయించుకోడానికి కార్యాలయానికి వెళ్లగా అధికారులు ఈ పొరపాటు చేశారని సావిత్రి పేర్కొంది. తప్పుడు ప్రమాణపత్రాన్ని ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
హనీట్రాప్..నలుగురి అరెస్ట్
యశవంతపుర: మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసి బెదిరింపులకు గురి చేసి రూ.1.50 లక్షలు వసూలు చేసిన నిందితులను దావణగెరె పోలీసులు అరెస్ట్ చేశారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకాకు చెందిన శివకుమార్(25)కు మిస్డ్ కాల్ ద్వారా దావణగెరెకు చెందిన గంగమ్మ అనే మహిళ పరిచయం అయింది. ఇలా ఏర్పడిన పరిచయంతో అతడి నుంచి తరచుగా డబ్బులు తీసుకుంది. ఇటీవల దావణగెరెకు వచ్చిన శివకుమార్‌కు ఫోన్ చేసిన గంగమ్మ సిద్ధవీరప్ప లేఔట్‌లోని తన ఇంటికి పిలిపించుకుంది. శివకుమార్ ఆమె ఇంట్లో ఉండగా ఇద్దరు యువకులు ఆకస్మికంగా వచ్చి వీడియో తీశారు. అనంతరం హరీశ్, చంద్రు, గంగమ్మ, గిడ్డగంగమ్మలు కలిసి వీడియోను చూపించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. అంత మొత్తం తన వద్దలేదనడంతో చివరకు రూ.లక్షన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వేధింపులు తీవ్రం కావడంతో తన వద్ద డబ్బులు తీసుకొని హనీట్రాప్ చేసి బెదిరించినట్లు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దావణగెరె పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం గంగమ్మ వీడియోను తీయించి హనీట్రాప్‌కు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సీబీ రిష్యంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment