మహిళా ఎస్‌ఐ ఇంటికి నిప్పు
యశవంతపుర: మహిళా ఎస్‌ఐ సెలవు పెట్టి ఊరికి వెళ్లగా, ఆమె ఉంటున్న అద్దె ఇంటికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కోణనూరులో జరిగింది. కోణనూరు స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న శోభా భరెమక్కనవర్ సెలవుపై ఊరికెళ్లారు. బుధవారం రాత్రి దుండగులు ఆమె ఇంటి తలుపులను బద్ధలు కొట్టి నిప్పుపెట్టారు. రూ.80 వేలు విలువగల లాప్‌టాప్, రూ.25 వేలు విలువైన డ్రెస్సింగ్ టేబుల్, రూ.60 వేలు విలువగల మంచం, రూ 50 వేలు విలువగల బట్టలు కాలిపోయాయి. శోభా సెలవు ముగించుకొని శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా మొత్తం దగ్ధమై కనిపించాయి. డిఎస్‌పీ మురళీధర్, సీఐ రఘుపతి పరిశీలించారు. జాగిలాలతో ఆధారాల కోసం దర్యాప్తు చేపట్టారు.
రెండు రంగుల మందారం
మండ్య: మండ్య నగరంలో ఉన్న చౌకి మఠం వద్ద నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నందకుమారి ఇంట్లో వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇందులో ఒక మందారం చెట్టు రెండు రంగులు ఉన్న పూలను పూచింది. ఒకే పుష్పం సగం ఊదా, మరో సగం ఎరుపు రంగులో పూచింది. ఈ వింత పుష్పాన్ని చూడడానికి జనం ఎగబడ్డారు. నందకుమారి మాట్లాడుతూ ఆ పుష్పం చూసి ఆశ్చర్యం వేసిందని చెప్పారు.
కాంగ్రెస్ కక్ష సాధింపు: బీవై
దొడ్డబళ్లాపురం: కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. శనివారం కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజా, మాజీ మంత్రి అశ్వత్థనారాయణపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. హత్యకు గురైన ప్రవీణ్ నెట్టారు భార్యకు ఇచ్చిన ఉద్యోగాన్ని తొలగించారని అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండు చేసారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment