ఘోరం జరిగిన ఇంటి ముందు గుమిగూడిన జనం
తుమకూరు: అప్పుల బాధలు, అలాగే ఇరుగు పొరుగు వేధింపులు పడలేక ఆవేదనకు గురై భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన తుమకూరు సిటీలోని సదాశివనగరలో చోటుచేసుకుంది. అక్కడ నివాసముంటున్న గనీబ్ సాబ్ (32), భార్య సుమయ్యా (30), వారి పిల్లలు హజీరా, మహ్మద్ సుభాన్, మహ్మద్ మునీర్ మృతులు. పిల్లల వయసు 7 నుంచి 10 ఏళ్లలోపు ఉంటుంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది.
కింది అంతస్తులోని వ్యక్తి కారణం
శిర తాలూకా చిక్కనహళ్లి నివాసి అయిన గనీబ్‌సాబ్ పిల్లల చదువుల కోసం ఇక్కడకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చికెన్ కబాబ్ షాపు ద్వారా జీవనం సాగించేవాడు. అయితే కింది అంతస్తులో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి తనను మానసికంగా హింసిస్తున్నాడని, తమ చావులకు అతడే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మా ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇరుగుపొరుగు వారు తనను దుర్భాషలాడేవారని వీడియోలో గోడు వెళ్లబోసుకున్నాడు. ఒక డెత్ నోట్ కూడా రాశాడని పోలీసులు తెలిపారు.
పిల్లలకు పురుగుల మందు తాగించి..
సాయంత్రం సమయంలో పిల్లలకు పురుగులు మందు తాగించారు, ఆపై దంపతులు ఉరివేసుకున్నారు. రాత్రికి ఈ విషయం గుప్పుమంది. వెంటనే ఎస్పీ కేవీ అశోక్, తిలక్‌పార్క్ పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను అంబులెన్సులో జిల్లాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో స్థానికులు గుమిగూడడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment