హుబ్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఆపరేషన్ కమల అవసరం లేదు. కాంగ్రెస్‌లోని అసమ్మతి వల్ల ప్రభుత్వం పడిపోతుందని, దీనికి గుబ్బి ఎమ్మెల్యే శ్రీనివాస్ బహిరంగ ప్రకటనే సాక్ష్యమని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తెలిపారు. ఆయన నగరంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల వల్ల ప్రభుత్వం పడిపోతుంది. అధికారం కోసం వారిలో వారు కొట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం దళిత సీఎం అంశం బయపెట్టారు. ఆ తర్వాత నలుగురు ఉపముఖ్యమంత్రులు చేయాలన్నది తెరపైకి తెచ్చారు. ఇప్పుడేమో సీఎం మార్పు అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయన్నారు. సిద్ధు సర్కార్‌ను కూల్చడానికి సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని శెట్టర్ ఎద్దేవా చేశారు.
కారు కడిగినందుకు జరిమానాలు
బనశంకరి: సిలికాన్ సిటీలో కావేరి నీటితో కారు శుభ్రం చేసిన యజమానులకు జలమండలి రూ.5 వేలు జరిమానా విధించింది. నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉండగా నీటిని వృథా చేశారని ఈ చర్యలు తీసుకున్నారు. సదాశివనగరలో కారును శుభ్రం చేసిన మహిళకు రూ.5 వేలు జరిమానా, ఇదే కారణంతో మహదేవపుర, డాలర్స్ కాలనీలో ఇద్దరికి జలమండలి అధికారులు జరిమానాలు వేశారు. కారు, బైక్ వాషింగ్ కు , పూల తోటలకు కావేరి నీటిని వాడరాదని జలమండలి తెలిపింది. కావేరి నీటిని తాగడానికి మాత్రమే ఉపయోగించాలని గతంలోనే పేర్కొంది.
మేకెదాటును నిర్మించాలి: దేవెగౌడ
శివాజీనగర: బెంగళూరు నగరానికి తాగునీరు సరఫరా చేయడానికి మేకెదాటు ప్రాజెక్ట్‌ను అమలు చేస్తామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, బీజేపీలు కూడా వారి మేనిఫెస్టోలో మేకెదాటును నిర్మిస్తామని ప్రకటించాలన్నారు. ఇందులో ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. దీనిపై అందరూ సమైక్యంగా ఉండాలన్నారు. మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కూడా కోరుతానన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్ట్ వల్ల 5 వేల హెక్టార్ల అటవీ భూమి మునిగిపోతుందని కొందరు చెప్పడం అవాస్తవమన్నారు.
రూ.25 లక్షల లంచం.. ముడా కమిషనర్ అరెస్టు
యశవంతపుర: ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ మంగళూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కమిషనర్ మన్సూర్ అలీ లోకాయుక్తకు చిక్కారు. టిడిఆర్ క్లియరెన్స్ చేయడానికి ముడుపులు తీసుకుంటూ ఉండగా లోకాయుక్త డీఎస్పీ చెలువరాజ్, సీఐలు అమానుల్లా, సురేశ్‌కుమార్‌లు దాడి చేసి పట్టుకున్నారు. సాగర్ రియాలిటి ప్రమోటర్స్ యజమాని గిరిధర్‌శెట్టి ఇటీవల కుడుపు గ్రామంలో భూమిని కొనుగోలు చేసి అందుకు టిడిఆర్ ఇవ్వాలని ముడాకు అర్జీ పెట్టుకున్నారు. కానీ ఫైలు కదలడం లేదు. మధ్యవర్తి సలీం ద్వారా కమిషనర్ మన్సూర్ రూ. 25 లక్షలు లంచం డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం గిరిధర్‌శెట్టి నుంచి రూ.25 లక్షలు తీసుకుంటూ ఉండగా కమిషనర్‌తో పాటు దళారీని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment