యత్నాళ్ ఓ మానసిక రోగి
హుబ్లీ: విజయపుర శాసనసభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ ఓ జోకర్ మాత్రమే కాకుండా మానసిక రోగి అని, ఆయన్ను తక్షణమే పిచ్చి ఆస్పత్రిలో చేర్పించడం మంచిదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ధ్వజమెత్తారు. బీదర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బసవణ్ణ ఈ దేశ సాంస్కృతిక నాయకుడు, ఆయనపై కూడా యత్నాళ్ చులకనగా మాట్లాడి కోట్లాది మంది బసవన్న అనుచరులు, భక్తులకు అవమానం చేశారన్నారు. ఈ విషయంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచిస్తానన్నారు. ఏ సమాజం వారైనా మహామానవతావాదిని అవమానిస్తే ఎవరూ సహించబోరన్నారు.
బీజేపీ హైకమాండ్ తీరు సందేహాస్పదం
ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసిన యత్నాళ్ నోటికి బీజేపీ హైకమాండ్ తాళం వేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. యత్నాళ్ తీరు గమనిస్తుంటే బీజేపీ అగ్ర నేతలు కావాలనే యత్నాళ్‌తో ఈ విధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యత్నాళ్ వక్ఫ్ బోర్డు పేరున రాజకీయం చేయడం తగదన్నారు. సీఎం సిద్దరామయ్య ఇప్పటికే ఆదేశాలను వెల్లడించి నిజమైన ఆస్తులను మాత్రమే వక్ఫ్ బోర్డులో చేర్చాలని సూచించారన్నారు. వక్ఫ్ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించడం మంచిదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ల్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నారని గుర్తు చేశారు. మంత్రి రహీం ఖాన్, ఆ జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు బసవరాజ, అరవింద కుమార్, అమృతరావ్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే
Comments
Please login to add a commentAdd a comment