సాహిత్య పరిమళాలు
కన్నడ పూదోటలో
ఊరేగింపులో కళాకారిణి సందడి
మండ్య: కన్నడ కస్తూరి పరిమళించింది. వేల సంవత్సరాల నుంచి సుసంపన్నంగా సాగుతున్న కన్నడ భాష ఔన్నత్యాన్ని చాటేలా కన్నడ ధ్వజాలు రెపరెపలాడాయి. జానపద కళా బృందాల విన్యాసాలు, కన్నడ మాత భువనేశ్వరి మాతకు జేజేలు పలుకుతూ మూడు దశాబ్దాల తర్వాత శుక్రవారం మండ్యలో అఖిల భారత కన్నడ సాహిత్య పరిషత్ 87వ సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరు–మైసూరు రహదారిలో అలంకరించిన కన్నడ రథంలో విరాజమానంగా ఆసీనులైన సమ్మేళనాధ్యక్షుడు నాడోజ డాక్టర్ గొ.రు.చన్నబసప్ప నుడి జాతర ఊరేగింపులో జానపద కళాబృందాలు, కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. నగరంలోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య ప్రతిమ వద్ద ఆదిచుంచనగిరి మఠం నిర్మలానందనాథస్వామీజీ సమ్మేళనాధ్యక్షుడితో కలిని నగారా వాయించి హల్మిడి శాసనానికి పుష్పార్చన గావించడం ద్వారా ఊరేగింపునకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు సమ్మేళనాధ్యక్షుడికి మైసూరు పేటా తొడిగి, శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించారు. పోలీసు బ్యాండ్ వాయిద్యంతో పాటు జై కన్నడాంబె, జై భువనేశ్వరి మాత అంటూ జయజయధ్వానాలు మారుమోగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.చలువరాయస్వామి, కసాప రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ మహేష్ జోషి, జిల్లా ఎమ్మెల్యేలు, సాహిత్య లోక దిగ్గజాలు పాల్గొన్నారు.
80 ఎకరాల్లో సమ్మేళన సభ
దాదాపు 80 ఎకరాల్లో సాహిత్య సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన సాహితీ అభిమానుల కోసం వందలాదిగా బుక్‌స్టాల్స్ ఏర్పాటు చేశారు. తాగునీరు, విద్యుత్, అంబులెన్స్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో కేఎస్ ఆర్టీసీ ఉచిత రవాణా వ్యవస్థ కల్పించింది. ప్రధాన వేదికపై గోష్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నడ సాహిత్యం డిజిటలీకరణ
రాజమాత కెంప నంజమ్మణ్ణి, రాజర్షి నాల్వడి కృష్ణరాజ ఒడెయర్ ప్రధాన వేదికలో సమగ్ర కన్నడ సారస్వత లోకపు శ్రీమంత సాహిత్యపు డిజిటలీకరణ ప్రక్రియను చేపట్టి సాహిత్యక డాటాబేస్‌ను తయారు చేసే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. మండ్యలో జరుగుతున్న 87వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనాన్ని శుక్రవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రం సాహిత్యపరంగా సమృద్ధమైన చరిత్రను కలిగి ఉందన్నారు. కన్నడ భాషలో ఎనిమిది మంది సాహితీవేత్తలు జ్ఞానపీఠ అవార్డులను సాధించారని గుర్తు చేశారు. ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల మహత్తరమైన కృతులు కూడా డిజిటలీకరణ చెంది ప్రపంచ నలుమూలలా అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. కన్నడ భాషకు చెందిన శ్రీమంత సాహిత్యాన్ని డిజిటలీకరణ చేయాలని తీర్మానించామన్నారు. మాతృభాషలో విద్యాబోధనకు అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు. పాలనలో కూడా కన్నడ వాడకానికి పెద్ద పీట వేశామన్నారు.
కన్నడ తీయదనాన్ని పంచిన చక్కెరనాడు మండ్య
అట్టహాసంగా అఖిల భారత కన్నడ సాహిత్య పరిషత్ సమ్మేళనం
కన్నడ ధ్వజాల రెపరెపలు
తరలివచ్చిన సాహితీవేత్తలు,
సాహితీ అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment