చల్లగా చూడు దేవుడా
బనశంకరి: కొత్త సంవత్సరంలో వెయ్యి శుభాలను లాభాలను ప్రసాదించు దేవుడా అని వేలాది భక్తులు ఆలయాల్లో పూజలు చేశారు. న్యూ ఇయర్ మొదటి రోజైన బుధవారం బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. సిలికాన్ సిటీలో గవి గంగాధరేశ్వర, మల్లేశ్వరం వయ్యాలికావల్ టీటీడీ మందిరం, కాడు మల్లేశ్వర, బనశంకరీ, రాజరాజేశ్వరి, గాలి ఆంజనేయస్వామి గుడి, అణ్ణమ్మ దేవి, రాజాజీనగర ఇస్కాన్ టెంపుల్, మహాలక్ష్మీ లేఔట్ శ్రీనివాస ఆలయం, పద్మనాభనగర తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి, వసంతపుర వసంత వల్లభరాయ ఆలయాల్లో తెల్లవారుజాము 5 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారికి నారికేళ ఫల పుష్ప తాంబూలాలు సమర్పించి పూజలు నిర్వహించారు. బసవనన గుడి దొడ్డగణపతిని వెండి కవచాలతో అలంకరించారు. వేలాది భక్తులు దర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయాలలో లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో
చిక్కబళ్లాపురలో ప్రసిద్ధ శ్రీ భోగనందీశ్వర స్వామి ఆలయం, ధర్మస్థల మంజునాథస్వామి, చామరాజనగర మలెమహదేశ్వర స్వామి, నంజనగూడు శ్రీకంఠేశ్వర, ఉడుపి శ్రీకృష్ణ మందిరం తదితర ఆలయాలను విశేషంగా అలంకరించారు. మలె మహదేశ్వరునికి భక్తులు రథోత్సవ సేవలు నిర్వహించారు. మైసూరు చాముండేశ్వరి కొండపై రథోత్సవాన్ని తలపించేలా వేలాది మంది భక్తులు వచ్చారు. చాముండేశ్వరి మాత దర్శనానికి పొడవైన క్యూలు ఏర్పడ్డాయి.
ఆలయాల్లో కొత్త ఏడాది పూజలు
అంతటా భక్తులతో రద్దీ
Comments
Please login to add a commentAdd a comment