విశేష అలంకరణలో బనశంకరీదేవి
బనశంకరి: బెంగళూరునగర ప్రజల ఆరాధ్య దేవత బనశంకరీదేవి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో బనశంకరీదేవి మూలవిరాట్‌కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం చేపట్టి వివిధ పుష్పాలతో అలంకరణచేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధనచేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు.
ధర్నా చేసే నైతిక హక్కు
బీజేపీకి లేదు
● మంత్రి రామలింగారెడ్డి
శివాజీనగర: కేఎస్‌ఆర్టీసీ సంస్థ బస్సు చార్జీల పెంపు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ధర్నాపై రవాణా, దేవదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు రవాణా కార్పొరేషన్లను సరైన దారిలో ముందుకు తీసుకొని వెళ్లినట్లయితే చార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చేదికాదన్నారు. బీజేపీ పాలన లోపంతో తమ తలపై రూ.5900 కోట్ల అప్పు పెట్టి వెళ్లారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2020లో బస్సు ప్రయాణం చార్జీలు పెంచారన్నారు. పేద ప్రజల గ్యాస్ సబ్సిడీని నిలిపిన బీజేపీకి బస్సు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాటం చేసే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ చార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రవాణా సదుపాయం దేశమంతటిలో నంబర్ 1గా పేరు పొందిందన్న మంత్రి రామలింగారెడ్డి, బస్సు టికెట్ ధర పెంపును సమర్థించుకున్నారు.
విజయేంద్ర ఇంటి
ముట్టడికి యత్నం
శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు మనోహర్ నేతృత్వంలో బెంగళూరులోని శివానంద సర్కిల్‌లో విజయేంద్ర ఇంటి ముందుకు కార్యకర్తలు చేరుకొని ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విజయేంద్ర ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే
కేసులోకి లాగుతున్నారు
శివాజీనగర: ఐశ్వర్యగౌడ అనే మహిళ నిఖిల్ కుమారస్వామి, అనితా కుమారస్వామిని భేటీ చేసినట్లు ఆరోపిస్తున్నారని, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలపాలని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. ఐశ్వర్యగౌడ కేస్‌లో నిఖిల్, అనితా కుమారస్వామి పేర్లు ప్రస్తావనకు వచ్చాయని, దీని వెనుక అదృశ్య చేతులు ఉన్నాయనేది తెలిసిందన్నారు. 2016లో ఘటన జరిగిందని, 2024లో ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 2018లో తానే సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కావాలనే ఇలాంటి కేసులో వీరిని లాగుతున్నారని కుమారస్వామి ధ్వజమెత్తారు.
వికటించిన ఈసీజీ టీకా
● పసికందు మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
తుమకూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో రెండున్నర నెలల పసికందు మృతి చెందగా ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకా సింగనహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చైత్ర, మురళి దంపతుల మగ శిశువుకు గురువారం మధ్యాహ్నం భక్తరహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈసీజీ తదితర మూడు టీకాలను ఒకేసారి వేయించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు శిశువు ఇంటిలోనే చనిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో పసికందు మరణించిందని స్థానికులు ఆరోపించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో సింగనహళ్లి గ్రామానికి ఆరోగ్య శాఖ అధికారులు చేరుకుని పరిశీలించారు. పసికందుకు ఈసీజీ టీకా ఇచ్చిన తర్వాత చనిపోవడం పైకి కనిపిస్తున్నా జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కుణిగల్ తాలూకా వైద్యాధికారి డాక్టర్ మరియప్ప తెలిపారు.
నాకు అన్యాయం : మంత్రి
దొడ్డబళ్లాపురం: తనకు అన్యాయం జరిగిందని, సీఐడీ దర్యాప్తు ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. బెళగావిలో శుక్రవారం సీఐడీ విచారణకు హాజరై తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె.. తనకు అందరి మద్దతు అవసరమన్నారు. చట్టం పరిధిలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు త్వరగా జరిగి తనను అవమానించిన సీటీ రవికి శిక్ష పడాలని అన్నారు. ఇది తన స్వాభిమానానికి సంబంధించిన విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment