శివాజీనగర: రాష్ట్ర బీజేపీలోని వర్గ రాజకీయాన్ని రూపుమాపడంపై జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా రాష్ట్ర ఆపార్టీ నాయకులతో సమాలోచనలు జరిపారు. శుక్రవారం బెంగళూరులోని నిమ్హాన్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి విచ్చేసిన జే.పీ.నడ్డా ఆ పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. పార్టీలో వర్గ రాజకీయానికి చరమగీతం పాడి అన్ని సమస్యలకు పరిహారాన్ని వెతికేందుకు ఏం చేయాలి. పార్టీ స్థాయిలో ఎలాంటి తీర్మానాలు కావాలి. ఏ విధంగా పార్టీలోని సమస్యలకు పరిహారం కనిపెట్టాలనే విషయమై సుదీర్ఘ చర్చలు జరిపారని తెలిసింది. బెంగళూరులోని ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన జే.పీ.నడ్డాను రాష్ట్ర బీజేపీకి చెందిన పలువురు నాయకులు కలిసి వర్గ రాజకీయంతో పార్టీ పటిష్టతకు కలిగే ఇబ్బందిని తెలియజేయడంతోపాటు సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిసింది. గురువారం బెంగళూరుకు విచ్చేసిన జే.పీ.నడ్డాను విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులైన ఆర్.అశోక్, ఛలవాది నారాయణస్వామి కలిశారు. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాలపై గంటపాటు చర్చించినట్లు తెలిసింది. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ఇతర నాయకులు ప్రత్యేక వక్ఫ్ పోరాటంపై ఫిర్యాదు చేయగా, ప్రత్యేక పోరాటాలతో పార్టీకి ఇబ్బంది కలుగుతోందని, దీనికి అరికట్టాలని విన్నవించినట్లు సమాచారం.
జే.పీ.నడ్డాను కలవని భిన్నాభిప్రాయ నాయకులు
జే.పీ.నడ్డా రాష్ట్రానికి వచ్చినా భిన్నాభిప్రాయ వర్గంగా ఉన్న ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్, రమేశ్ జార్కిహొళి, అరవింద బెల్లద్, కుమార్ బంగారప్ప కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు నడ్డా వచ్చారని, పార్టీకి విషయంగా రాలేదని, అందుచేత భేటీ కాలేదని వారు చెబుతున్నారు. మరోవైపు శనివారం బళ్లారి, కంప్లిలో వక్ఫ్ వ్యతిరేకంగా పోరాటముందని, తామంతా అక్కడికి వెళుతున్నామని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment