వెంటాడిన విషాదహేల
దొడ్డబళ్లాపురం: కొత్త ఏడాది వేడుకలలో పలుచోట్ల విషాదాలు సంభవించాయి. సంతోషం స్థానంలో కుటుంబాలకు కన్నీరు మిగిలింది. మూడు చోట్ల కారు ప్రమాదాల్లో ఆరు మంది దుర్మరణం చెందారు. వివరాలు.. సంబరాలు చేసుకుని కారులో వెనుదిరిగిన ఇద్దరు స్నేహితులు ప్రమాదంలో చనిపోయారు. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కొడసోగె గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బొమ్మలాపుర విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ పవర్‌మ్యాన్‌గా పని చేస్తున్న ప్రతాప్, మిత్రుడు కొంగళయ్య అనే ఇద్దరు మంగళవారం రాత్రి ఓ హోటల్‌లో కొత్త ఏడాది వేడుకలు చేసుకుని కారులో తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. కారు నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తెరకణాంబి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇన్నోవా బోల్తా, ఇద్దరు దుర్మరణం
మాగడి తాలూకా తావరెకెరె రోడ్డులోని జనతా కాలనీలో ఇన్నోవా బోల్తా పడి బెంగళూరుకు చెందిన మంజు (31), కిరణ్ (30) అనే ఇద్దరు చనిపోయారు. 8 మంది బుధవారం తెల్లవారుజామున కారులో బెంగళూరు నుండి మాగడికి విహారానికి బయలుదేరారు. తిరిగి వస్తుండగా అతి వేగం వల్ల అదుపుతప్పిన కారు పల్టీలు పడింది. ప్రమాదంలో కిరణ్, మంజు మృతిచెందగా మిగతా 6 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
క్యాంటర్‌ను కారు ఢీ.. ఇద్దరు మృతి
నిలిచి ఉన్న క్యాంటర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన కనకపుర తాలూకా సాతనూరు బస్టాండు వద్ద చోటుచేసుకుంది. మృతులు నిరంజన్ (41), విశ్వనాథ్ (43). సమీపంలోని ప్రైవేటు రిసార్ట్‌లో న్యూ ఇయర్ పార్టీలో హాజరై తిరిగి స్విఫ్ట్ కారులో వెళ్తుండగా క్యాంటర్‌ను ఢీకొట్టారు. కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సాతనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
3 చోట్ల కారు ప్రమాదాలు..
6 మంది దుర్మరణం
సిటీలో 513 డ్రంక్ కేసులు
యశవంతపుర: మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలను నడుపుతూ 513 మంది పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 28,127 బైక్‌లు, కార్లు తదితర వాహనదారులను తనిఖీ చేశారు. మద్యపానం చేసినట్లు నిర్ధారణ అయిన వెంటనే వాహనాలను సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే.
Comments
Please login to add a commentAdd a comment