హుబ్లీ: మీటర్ వడ్డీ వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి నడుస్తున్న లారీ కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇక్కడి హుబ్లీ బైపాస్‌లోని హనుమప్ప దేవస్థానం వద్ద శనివారం రాత్రి జరిగింది. ఉణకల్ నివాసి సిద్దప్ప మహాదేవ కెంచన్నవర(47) మృతుడు. ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ మృతుడు సిద్దప్ప తన స్టేటస్‌లో మూడు పేజీల డెత్‌నోట్ పోస్టు చేసి శనివారం రాత్రి 10 గంటల సమయంలో లారీ చక్రాల కింద పడి మృతి చెందాడు. లారీ డ్రైవర్, యజమానిపై చర్యలు తీసుకోవద్దంటూ తన డెత్‌నోట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. మహేష్ చిక్కవీరమఠ అనే వ్యక్తి నుంచి ఏడేళ్ల క్రితం సిద్దప్ప రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి వడ్డీతో సహా రూ.65 లక్షలు తిరిగి చెల్లించాడు. అయినా సంతృప్తి పడకుండా వెంట పడి వడ్డీ, అసలు ఇంకా ఇవ్వాలంటూ మహేష్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు డెత్‌నోట్‌లో సిద్దప్ప వివరించినట్లు తెలిపారు. తనకు మీడియా వారు, ఎమ్మెల్యే, ఎంపీ పరిచయం ఉన్నారంటూ బెదిరించి మహేష్ తన వద్ద డబ్బులు గుంజేవాడు, అలా అనేక సార్లు డబ్బులు తీసుకొని తన జీవితం సర్వనాశనం చేశాడు. అతని మాయమాటలకు ఎవరూ బలి కారాదని, అసలు అతనితో ఆర్థిక వ్యవహారాలు చేయరాదని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ డెత్‌నోట్‌లో మృతుడు పేర్కొన్నట్లు కమిషనర్ తెలిపారు. కాగా ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment