సాయం కోసం నిరీక్షణ
● వరదలు వచ్చి నాలుగు నెలలైనా బాధితులకు మొండిచేయే ● పలువురికి అందని ప్రభుత్వ చేయూత ● కేఎంసీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ● నిధులు రావాల్సి ఉందంటున్న యంత్రాంగం
ఖమ్మంమయూరిసెంటర్: మున్నేరుకు వరదలు వచ్చి నాలుగు నెలలు అయినా.. బాధితులు మాత్రం సాయం కోసం కేఎంసీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ ఇళ్లలోకి వరదలు వచ్చి నష్టం జరిగిందని, అయినా ప్రభుత్వ సాయం అందలేదని, పక్కవారికి సాయం అందించి తమకు ఎందుకు ఇవ్వడం లేదని బాధితులు అధికారులను నిలదీస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 1న మున్నేరుకు వచ్చిన భారీ వరదలతో వందలాది ఇళ్లు నీట మునిగి వేలాది కుటుంబాలు నష్టపోయాయి. బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.16,500 అందించేందుకు అధికారులతో సర్వే చేయించింది. వరదలు తగ్గిన వెంటనే అధికారులు సర్వే చేయగా.. 9,279 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు 9,279 కుటుంబాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కానీ సాంకేతిక కారణాలతో 60 కుటుంబాల వారికి సాయం అందలేదు. కాగా, తమ ఇళ్లను సర్వే చేయనందున తమకూ సాయం అందించాలని బాధితులు కేఎంసీ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాలతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మరోమారు సర్వే చేశారు.
ప్రభుత్వానికి నివేదికలు..
వరదలతో నష్టపోయినా సర్వేకు రాలేదని బాధితులు కేఎంసీ చుట్టూ తిరగడంతో అధికారులు రెండోసారి సర్వే చేసి 2,800 కుటుంబాల వారిని సాయానికి అర్హులుగా గుర్తించారు. వీరి వివరాలను నమోదు చేసుకున్న అధికారులు ప్రభుత్వానికి పేర్లతో కూడిన నివేదికను పంపించారు. అయితే రెండో సారి సర్వే చేసిన కుటుంబాల వివరాలను ప్రభుత్వానికి పంపినా.. ఇప్పటి వరకు వారికి అందించే సాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తోటి వారికి సాయం అందినా.. తమకు ఇంకా నష్టపరిహారం అందలేదని బాధితులు ప్రతి రోజు కేఎంసీ కార్యాలయానికి వచ్చి అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే వరద సాయం అందిస్తామని అధికారులు వారికి చెప్పి పంపిస్తున్నారు. ఇక ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌లో బాధితులు అధికారుల వద్దకు వచ్చి తమకు సాయం ఎందుకు ఇవ్వడం లేదని వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ అంశంపై కేఎంసీ అధికారులను వివరణ కోరగా.. మొదటి విడత సర్వే చేసిన బాధితులకు నగదు సాయం అందించామని తెలిపారు. ఈ విడతలో 70 మందికి సాంకేతిక కారణాలతో అందలేదని, రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ఇక రెండో సారి సర్వే చేసిన వారికి మాత్రం సాయం నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment