అపార్.. అనేక చిక్కులు!
● విద్యార్థులకు వన్ నేషన్.. వన్ స్టూడెంట్ కార్డు ● వివరాల నమోదులో తీవ్ర జాప్యం ● జిల్లావ్యాప్తంగా 1,271 పాఠశాలలు, 1,00,572 మంది విద్యార్థులు ● ఇప్పటివరకు నమోదు చేసింది 15.15 శాతం మాత్రమే ● ఈ నెల 31తో ముగియనున్న గడువు
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రతీ విద్యార్థికి అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంస్థలు దృష్టి సారించి నమోదు ప్రక్రియ చేపట్టాయి. అయితే వివరాలు నమోదు సమయంలో తలెత్తుతున్న సమస్యలతో అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నారు. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకేచోట నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ అపార్ నమోదులో పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, వంటి తదితర తప్పిదాల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 1,271 పాఠశాలల్లో 1,00,572 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటివరకు కేవలం 15,234 మంది విద్యార్థులకు మాత్రమే అపార్ ఐడీ ల కోసం వివరాలను నమోదు చేశారు. గతేడాది డిసెంబర్ 31 వరకు ఇచ్చిన గడువు పెంచుతూ కేంద్రం ఈ నెల 31 వరకు అవకాశం కల్పించినా వివరాల నమోదులో వేగం పుంజుకోవడం లేదు.
ఒకేచోట పూర్తి సమాచారం..
వ్యక్తిగత గుర్తింపు కోసం దేశపౌరులకు ఆధార్ కార్డు ఉన్నట్లుగా విద్యార్థులకు సైతం ‘అపార్’ కార్డులు జారీ చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యాచరణను ప్రారంభించింది. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కార్డులో నమోదు చేస్తారు. ఒక్కసారి నమోదు చేస్తే ఆ వివరాలను మళ్లీ మార్చేందుకు అవకాశం కూడా లేదు. దీంతో పిల్లల తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవడం కూడా తప్పనిసరిగా మారింది. అపార్‌లో విద్యార్థి పేరు, ఊరు, పుట్టిన తేదీ, పాస్‌ఫొటో, ఆధార్ నంబర్ మాదిరి 12 అంకెల గుర్తింపు సంఖ్య, స్కాన్ ద్వారా వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ కార్డుపై ముద్రిస్తారు. విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే క్రమంలో నమోదు చేసిన వివరాలు ఆధార్‌లోని వివరాలు ఒకేలా ఉంటేనే అపార్ నంబరు జెనరేట్ అవుతుంది. పాఠశాలల్లో వివరాలు మార్చేందుకు వీలుండేది కాదు. కానీ ప్రస్తుతం ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా చేసుకుని మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల్లో డీఈవోలకు మార్పు చేసే అధికారాన్ని విద్యా శాఖ కల్పించింది. పాఠశాల రికార్డులు మార్చుకోవద్దు అనుకుంటే కచ్చితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబరు కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. తరగతుల వారీగా మార్కులు, వ్యక్తిగత వివరాలు, ఎంత వరకు చదువు సాగించారు. తదితర ధ్రువ పత్రాలు భద్రపరుచుకోవచ్చు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే సమయంలో అపార్ కార్డు ప్రామాణికంగా మారుతుంది. ఉద్యోగాలకు వెళ్లినా, పైచదువు, కార్యాలయాల్లో అపార్ ఆధారంగా అభ్యర్థి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అపార్ కార్డు విద్యార్థి చదువుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక లాకర్‌లా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా వివరాలు
మండలం విద్యార్థులు అపార్ నమోదు శాతం
తిర్యాణి 3,153 69 2.19
జైనూర్ 7,906 254 3.21
సిర్పూర్(యూ) 2,770 198 7.15
పెంచికల్‌పేట్ 2,355 295 12.53
కౌటాల 6,473 845 13.05
బెజ్జూర్ 4,635 637 13.74
చింతలమానెపల్లి 4,469 664 14.86
లింగాపూర్ 1601 244 15.24
రెబ్బెన 5,725 894 15.62
సిర్పూర్(టి) 6,773 1,066 15.74
కాగజ్‌నగర్ 23,348 3,737 16.01
దహెగాం 4,164 720 17.29
కెరమెరి 5,261 1,016 19.31
ఆసిఫాబాద్ 16,201 3,246 20.04
వాంకిడి 5,738 1,349 23.51
మొత్తం 1,00,572 15,234 15.15
నమోదులో సమస్యలు ఇలా..
పాఠశాల రికార్డులో ఉన్న వివరాలు ఆధార్ కార్డుతో సరిపోలితేనే అపార్ నమోదు సాధ్యపడుతుందని పాఠశాలల సిబ్బంది తెలుపుతున్నారు. ఆధార్‌లో ఇంటి పేరు లేదా విద్యార్థి పేరులో ఏదో ఒక అక్షరం తప్పుగా ఉన్నా వివరాల నమోదు సాధ్యపడటం లేదు. చాలామంది చిన్నారులకు ఏడాది వయస్సుకు ముందే ఆధార్ కార్డులు తీసి ఉండటం, అప్పుడు సరైన పేరు, చిరునామా, తదితర వివరాలు నమోదు చేసుకోకపోవడం.. ఆ తర్వాత పాఠశాలలో చేర్పించే సమయంలో వేరే పేర్లు, చిరునామా ఉండటంతో ఈ సమస్య ఏర్పడుతోంది. పాఠశాల రికార్డుల్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య అధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. అపార్ నమోదు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డును సవరించుకోవాల్సి ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పట్టింపులేకుండా ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో ఇప్పటివరకు 15.15 శాతం మాత్రమే అపార్ నమోదు చేశారు. తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యూ) మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తిర్యాణి మండలంలో 2.19 శా తం, జైనూర్‌లో 3.21 శాతం, సిర్పూర్(యూ)లో 7.15 శాతం.. మొత్తం 10 శాతం నమోదు కూడా చేయలేకపోయారు. అత్యధికంగా వాంకిడి మండలంలో 23.51 శాతం అపార్ నమోదు జరిగినట్లు జిల్లా విద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ ఈ నెల 31 లోగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అపార్ నమోదు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యం చేరడం అనుమానంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment