మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన స్పౌజ్(భార్యాభర్తల) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా విడుదల చేసిన జీవో నంబరు 243 ద్వారా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం జీవో 2, 3 విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జీవో నం.2ద్వారా 698మంది ఉపాధ్యాయులను, జీవో నం.3 ద్వారా 136మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భార్యాభర్తలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ నుంచి ఇద్దరు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 28 మంది టీచర్లు మంచిర్యాలకు.. మంచిర్యాల జిల్లా నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కు ఒక్కొక్కరు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు 30మంది స్పౌజ్ కింద బదిలీ అయ్యారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్(ఇన్‌కమింగ్) బ్లాక్‌లిస్టులో చేర్చడం వల్ల ఉపాధ్యాయులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ రెండు జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినా ఇక్కడికి వద్దామనుకున్నా ఉపాధ్యాయులకు చుక్కెదురైంది. స్పౌజ్‌లో ఎవరైనా ఇతర జిల్లాలో పనిచేస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలంటూ అంగీకార పత్రాలు సమర్పించాలని పేర్కొనడంతో ఆందోళనకు గురయ్యారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలు బ్లాక్‌లిస్టులో ఉండడంతో ఆయా జిల్లాలో పనిచేస్తున్న భార్యాభర్తలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గత ప్రభుత్వం జీవో 317 ఇవ్వగా చాలామంది భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అప్పట్లో స్పౌజ్ కేటగిరీలో కొందరికి న్యాయం జరగ్గా.. మరికొందరిని ఒకే జిల్లాకు అలాట్ చేయలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయ దంపతులు ఒకే చోటికి బదిలీ చేయనుండడంతో ఊరటనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment