‘ఆత్మీయ భరోసా’కు కసరత్తు
● ఈ నెల 26 నుంచి అమలుకు శ్రీకారం ● ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు ● 2023– 24లో కనీసం 20 ‘ఉపాధి’ పనిదినాలు చేసిన వారు అర్హులు ● మెదటివిడతగా రూ.6 వేల నగదు ఖాతాల్లో జమ
తిర్యాణి(ఆసిఫాబాద్): సాగుకు యోగ్యమైన భూమి కలిగిన రైతులకు పెట్టబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయనుంది. అలాగే భూమి లేని నిరుపేదలకు సైతం అండగా నిలిచేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని నిరుపేద కూలీలకు రూ.12 వేల నగదు అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో రూ.6వేల నగదును ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో నమోదు చేయనున్నారు. అర్హుల గుర్తింపు కోసం ఇప్పటికే గ్రామాల్లో సర్వే చేపట్టారు.
20 రోజుల పనిదినాలు..
ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం రేషన్ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నారు. అలాగే ఉపాధిహామీ పథకం కింద 2023– 24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పనిదినాలు పూర్తి చేయాలి. కుటుంబంలోని కూలీలందరూ కలిసి కనీసం 20 పనిదినాలు నమోదు చేయాలి. భూమి ఉండి ఉపాధిహామీ పనులకు వెళ్లే వారికి ఈ పథకం వర్తించదని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
22,744 కుటుంబాలు అర్హత
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 1,23,010 జాబ్‌కార్డులు ఉండగా ఇందులో 1,23,010 కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే మొత్తం 2,44,026 కూలీల్లో 1,70,396 మంది పనులకు వెళ్తున్నారు. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 56,499 కుటుంబాలు 20 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. వీరిలో భూమి కలిగిన వారిని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా దాదాపు 22 వేల కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా లబ్ధి పొందనున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 22,744 కుటుంబాలు ప్రాథమికంగా అర్హత సాధించగా, గుర్తించిన వారి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను ఉపాధిహామీ సిబ్బంది సేకరించారు. ఈ నెల 24 నుంచి నిర్వహించే గ్రామసభల్లో అర్హుల వివరాలు వెల్లడిస్తారు. అనంతరం గ్రామసభలో తీర్మానం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కలెక్టరేట్‌కు నివేదించనున్నారు. పథకానికి ఎంపిక లబ్ధిదారులకు ఈ నెల 26 నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది.
అర్హులను గుర్తిస్తున్నాం
2023– 24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజుల పనిదినాలు పూర్తి చేసి, భూమి లేని రైతు కూలీలను అర్హులుగా గురిస్తున్నాం. అర్హుల బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో జాబితా ప్రదర్శిస్తాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
2023– 24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు
మండలం జాబ్‌కార్డుల సంఖ్య
ఆసిఫాబాద్ 5,119
బెజ్జూర్ 4,289
చింతలమానెపల్లి 2,598
దహెగాం 5,145
జైనూర్ 3,654
కాగజ్‌నగర్ 3,968
కెరమెరి 5,686
కౌటాల 4,700
లింగాపూర్ 2,723
పెంచికల్‌పేట్ 2,100
రెబ్బెన 3,375
సిర్పూర్(టి) 2,627
సిర్పూర్(యూ) 2,039
తిర్యాణి 4,444
వాంకిడి 4,032
మొత్తం 56,499
Comments
Please login to add a commentAdd a comment