బోగస్ సొసైటీలను నమ్మి మోసపోవద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో రకరకాల కార్మిక సంఘాలు, సొసైటీలు స్థాపించి సినీ కార్మికులను మోసం చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం – డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హెచ్చరించింది. విజయవాడ గాంధీనగర్‌లోని ఫిలిం చాంబర్ హాలులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భరత్‌భూషణ్, దామోదర ప్రసాద్ మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు సొసైటీలు, కార్మిక సంఘాలు స్థాపించి సినీ కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు చాంబర్ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిని నమ్మి మోసపోవద్దని సినీ కార్మికులను హెచ్చరించారు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన తెలుగు ఫిలిం చాంబర్, దానికి అనుబంధంగా తెలుగు ఫిలిం– డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, 24 అనుబంధ సంఘాలు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఇకపై ఎవరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కార్మికులకు త్వరలో ‘స్కిల్ డెవలప్‌మెంట్, వర్క్‌షాపులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఆయా సంఘాల బాధ్యులు జె.సాంబశివరావు, అలంకార్ ప్రసాద్, అమ్మిరాజు, వి.సురేష్, వెల్లంకి శ్రీనివాస్ కుమార్, డి.సత్యనారాయణ, మురళీకృష్ణ పాల్గొన్నారు.
తెలుగు ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్
Comments
Please login to add a commentAdd a comment