మూడుముళ్లకు వెనకడుగు
30 ఏళ్ల వయసు దాటినా పెళ్లికి ఇప్పుడేం తొందరంటున్న యువత
ఇవి కూడా కారణమే..
తల్లిదండ్రులు అస్తమానం గొడవ పడటం చూసిన పిల్లలు, పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో అని ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండే ఫ్యామిలీలు తగ్గిపోయాయి. తమ మైండ్‌సెట్‌కు అనుగుణంగా ఉండే అమ్మాయి దొరక్కపోతే ఇదే విధంగా గొడవలు జరుగుతాయేమో అని ఊహించు కుని పెళ్లికి కొందరు దూరం అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా కారణంగా నిలుస్తున్నాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలనేది ఒకప్పటి పెద్దల మాట. ఆడ పిల్ల వయస్సు 20 ఏళ్లు దాటితే చాలు తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తమకు ఇష్టమైనప్పుడు, నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని చదువుకున్న ఆడపిల్లలు తెగేసి చెబుతున్నారు. జీవితంలో స్థిరపడి, లైఫ్‌ను కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు భావిస్తున్నారు. ఈ పరిస్థి తుల్లో యువతీయువకులకు సంబంధం కుదిర్చి పెళ్లి చేయడమంటే మామూలు విషయం కాదంటున్నారు పెళ్లిళ్ల పేరయ్యలు. మూడు పదుల వయసు దాటినా తమ పిల్లలు పెళ్లి ఊసెత్తడం లేదని, అడిగితే ఇప్పుడేం తొందర అంటున్నారని పలువురు తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు.
కారణాలు ఇవీ..
● జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు, అమ్మాయిలు ఇష్టపడటం లేదు.
● పెళ్లి విషయంలో అమ్మాయిల కోరికలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అత్తమామలతో కలిసి ఉండేందుకు కొందరు ఇష్టపడటం లేదు.
● వ్యాపారం చేసే అబ్బాయిలు ఇప్పుడు నచ్చడం లేదు. ఉద్యోగులే కావాలంటూ భీష్మిస్తున్నారు.
● ఉద్యోగం ఉన్నా, ఆస్తులు కూడా ఉండాలంటూ గొంతెమ్మ కోర్కెలు ఎక్కువగా ఉంటున్నాయి.
● అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునేందుకు తొందర పడటం లేదు.
● వ్యక్తిగత జీవితాన్ని సరదాగా గడపాలంటే పెళ్లి చేసుకోకూడదని కొందరు భావిస్తున్నారు.
● అబ్బాయిల ఎమోషన్ ఫీలింగ్స్ షేర్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు వెలిశాయి.
● విజయవాడ భవానీపురానికి చెందిన లావణ్య (పేరుమార్చాం) సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. నెలకు రూ.లక్షన్నరకు పైగా జీతం. 34 ఏళ్లు వచ్చే వరకూ పెళ్లి ఊసెత్తలేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదని చెబుతూ వచ్చేది. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే ఆ వయస్సుకు తగిన సంబంధాలు దొరకడం లేదు.
● విజయవాడ పటమటకు చెందిన ఇంద్రజ (పేరుమార్చాం) ప్రభుత్వంలో గెజిటెడ్ ఉద్యోగం చేస్తోంది. 24 ఏళ్లకే ఆమెకు ఉద్యోగం వచ్చింది. అప్పట్లో పెళ్లి చేద్దామంటే ఇప్పుడేం తొందర అంటూ కాలం గడిపింది. ఇప్పుడామె వయస్సు 37 ఏళ్లు. నాలుగేళ్లుగా సంబంధాలు చూస్తున్నా నచ్చిన సంబంధం దొరకడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇలా అమ్మాయిలతో పాటు, అబ్బాయిలు సైతం 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని వారే ఎక్కువగా ఉంటున్నారు. పెళ్లిళ్ల పేరయ్యల వద్దకు వచ్చే వారు కూడా ఆ వయస్సు వారే ఉంటున్నట్లు చెబుతున్నారు.
సెటిల్ అవ్వాలని కొందరు..లైఫ్ ఎంజాయ్ చేయాలని ఇంకొందరు.. అనువైన సంబంధం కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న మరి కొందరు.. పిల్లల పెళ్లి ఎప్పుడవుతుందో తెలియక ఆందోళనలో తల్లిదండ్రులు
ఆలోచనల్లో మార్పు వచ్చింది
ప్రస్తుతం యువతీ యువకుల ఆలోచనల్లో మార్చు వచ్చింది. పెళ్లికి తొందర పడటం లేదు. ఉద్యోగం వచ్చి కెరీర్‌లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందా మని అబ్బాయిలు భావిస్తున్నారు. తమ కోరికలకు అనువైన అబ్బాయిల కోసం అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా ఉంటోంది. కొందరు జీవితాంతం ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
– డాక్టర్ గర్రే శంకరరావు,
మానసిక నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment