హాస్యం జీవితంలో భాగం కావాలి
విజయవాడ కల్చరల్: హాస్యం జీవితంలో భాగం కావాలని సినీ మాటలు, నాటక రచయిత మాడభూషి దివాకర్‌బాబు అన్నారు. హాసం క్లబ్ 11వ వార్షికోత్సవం, దివాకర్‌బాబుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జరిగింది. దివాకర్‌బాబు మాట్లాడుతూ హాస్యపు సంభాషలు చాలా సందర్భాల్లో విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. సినీ మాటలు, నవలా రచయిత సూర్యదేవర రామ్మోనరావు మాట్లాడుతూ.. దివాకర్‌బాబు బహుముఖ ప్రతిభాశాలి అని, సున్నిత హాస్యానికి చిరునామా అని కొనియాడారు. అనంతరం దివాకర్ బాబును నిర్వాహకులు సత్కరించారు. హాసం క్లబ్ వ్యవస్థాపకుడు కమలాకాంత్, అధ్యక్షుడు మాడుగుల రామకృష్ణ, బోడి ఆంజనేయరాజు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరిగెల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు నిర్వహించిన హాస్య ప్రహసనాలు అలరించాయి.
పేకాడుతూ చిక్కిన
ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి, విజయవాడ: వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పేకాడుతూ పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన వేమిరెడ్డి నర్సి రెడ్డి, వేములకొండ కృష్ణారావు, తియ్యగూర పుల్లారెడ్డి, పాలగిరి బసివిరెడ్డి, పోలుకొండ చక్రవర్తి, పోతురాజు రమేష్‌బాబు, గల్లా శశిభూ షణరావు, తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి, తేనేటి మురళి అదే గ్రామ శివారులోని ఓ భవనంలో పేకాడుతూ ఈ నెల 11న పోలీసులకు చిక్కారు. వీరిలో మొదటి ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులే. పట్టుబడిన తొమ్మిది మంది నుంచి రూ.36,650 నగదును సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. వారం రోజుల పాటు విషయాన్ని దాచి పెట్టిన పోలీసులు ఆనోటా ఈనోటా సమాచారం తెలిసి ప్రశ్నించగా అప్పుడు వెల్లడించడం గమనార్హం. సామాన్యుడికి ఒక రూలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూలు అన్నట్టు వ్యవహరించిన పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్‌కు
భారత రత్న ఇవ్వాలి
విజయవాడస్పోర్ట్స్: మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని బెజ వాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు కోరారు. స్థానిక సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బీబీఏ హాల్‌లో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీబీఏ కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామప్రసాద్ (రాజా) మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు దేశంలోనే అత్యున్నత గౌరవప్రదమైన భారత రత్న ఇవ్వా లని కోరారు. త్వరలోనే బార్ అసోసియేషన్ ద్వారా ఈ మేరకు తీర్మానం చేసి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రికి వినతి పత్రం పంపిస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, బీబీఏ ప్రతినిధులు చేకూరి శ్రీపతిరావు, వి.గురునాథం, మట్టా జయకర్, సంపర దుర్గాశ్రీనివాసరావు, సి.హెచ్.జగదీష్, మోటుపల్లి సత్యనారాయణ, ఇజ్రాయిల్, పులి మధు, మోటుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు
కంకిపాడు: ఇబ్బందులు ఉన్నా తొమ్మిది గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘అన్నదాతలపై ఏడుపు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురిత మైన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ వేళలు కుదించటం జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజులుగా పొగ మంచు కురుస్తున్న కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడిందని, ఈ నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమయాన్ని రీ షెడ్యూల్ చేశామని వివరించారు. అయితే తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment