లాఠీ.. సేవల్లో మేటి
గుడ్లవల్లేరు: పోలీసు అధికారులు అంటే కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. పలువురు విధి నిర్వహణలో కఠినంగా ఉన్నా సేవ, దానగుణంతో నలుగురి మన్ననలు పొందుతారు. ఆ కోవకు చెందిన వారే మండలంలోని విన్నకోట గ్రామానికి చెందిన విశ్రాంత ఏఎస్పీ శాయన సుశీలరావు. పోలీసు ఉన్నతాధికారిగా ప్రజల మెప్పు పొందడమేకాదు గాయకుడిగా, దాతగా పేరుపొందారు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవల్లో నిమగ్నమైన ఆయన తన గాత్ర మాధుర్యంతో శ్రోతలను అలరిస్తున్నారు.
పేద విద్యార్థులకు అండగా..
పేద విద్యార్థుల చదువు అర్ధంతరంగా ఆగకూడదన్నది సుశీలరావు అభిప్రాయం. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 65 మంది పేదలకు ఆర్థిక సాయం చేశారు. వారి ఆర్థిక అవసరాల మేరకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ సాయం చేసి, వారు ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు అండగా నిలిచారు. అంతే కాదు గ్రామాభివృద్ధికి భూరి విరాళాలు ఇచ్చారు. 2010లో ఉద్యోగ విరమణ చేశాక తన తల్లిదండ్రులు శాయన వీర రాఘవమ్మ, వీర భద్రయ్య పేరిట సేవా సమితిని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు మీద 15 ఏళ్లగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విన్నకోటలో అంకమ్మ తల్లి ఆలయం, ఫంక్షన్ హాల్, శ్మశాన వాటిక నిర్మాణంతోపాటు పాటు జేమ్స్‌పేటలో చర్చి నిర్మాణానికి తనవంతు ఆర్థిక సాయం చేశారు. సుశీలరావు కుమార్తె సంధ్య కూడా తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.
నలుగురూ మెచ్చేలా విధి నిర్వహణ..
● 1980లో ఏలూరు కెనాల్‌లో దూకి ప్రాణాపాయంలో ఉన్న మహిళను కాపాడి ప్రధాన మంత్రి ఉత్తమ సేవా మెడల్‌ను అందుకున్నారు.
● గుంటూరు జిల్లా పెదపరిమిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో అన్ని గ్రూపులను అదుపు చేయటంలో మంచి ప్రతిభను కనబరిచారు. ఆ విధులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని ఇచ్చి గౌరవించింది.
● ఖమ్మంలో డీఎస్పీగా పని చేస్తున్న రోజుల్లో ఉత్తమ సేవలు అందించిన సుశీలరావు ఉత్తమ సేవా పతకం అందుకున్నారు.
● పోలీసు అమర వీరుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు. టెన్నిస్ డబుల్స్‌లో రన్నర్‌గా నిలిచారు.
● పోలీసు అధికారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో గాయకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఆహూతులను అలరించారు.
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం గ్రామ అభివృద్ధికీ విరాళాలు ప్రజల మన్ననలు పొందుతున్న విశ్రాంత ఏఎస్పీ సుశీలరావు
Comments
Please login to add a commentAdd a comment