దేవీ వైభవం.. ఉత్సవ శోభితం | - | Sakshi
Sakshi News home page

దేవీ వైభవం.. ఉత్సవ శోభితం

Published Fri, Oct 4 2024 2:10 AM | Last Updated on Fri, Oct 4 2024 2:10 AM

దేవీ

ఆకట్టుకున్న కళాకారుల శక్తి రూపాల ప్రదర్శన

శ్రీశైలంటెంపుల్‌: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలసి వెలిసిన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురు వారం ఉదయం 8 గంటలకు వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ తో ముగుస్తాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు అమ్మవారికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీహోమం, రుద్రహోమం, జపములు, పారాయణలు నిర్వహించనున్నారు. మొదటి రోజు గురువారం ముందుగా శ్రీశైల దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజు దంపతులు ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రవేశం చేశారు. ఈ ఉత్సవాలకు నాందిగా ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకకణపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అఖండదీపాస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన తదితర పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శైలపుత్రిగా శ్రీశైల భ్రామరీ..

దసరా నవరాత్రోత్సవాలలో చేపడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా మొదటి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు శ్రీశైల భ్రమరాంబను శైలపుత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం ఎదుట ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకృతులైన అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలు చేపట్టి హారతులిచ్చారు. నవదుర్గలలో ప్రథమ రూపమైన శెలపుత్రి దేవిని పూజించడంతో విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని, ముత్తైదువులకు ఐదవతనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

భృంగివాహనసేవ

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగివాహనంపై ఉంచి ప్రత్యేక పూజాదికాలు చేపట్టారు. వర్షం కారణంగా స్వామిఅమ్మవార్లకు నిర్వహించే గ్రామోత్సవం రద్దయింది. రెండవ రోజు శుక్రవారం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో, స్వామిఅమ్మవార్లు మయూరవాహన సేవలో దర్శనమివ్వనున్నారు.

శ్రీగిరిలో దసరా మహోత్సవాలు

ప్రారంభం

శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ

శైలపుత్రిగా భ్రామరీ దర్శనం,

భృంగివాహనంపై మల్లన్న విహారం

వర్షంతో గ్రామోత్సవం రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
దేవీ వైభవం.. ఉత్సవ శోభితం1
1/2

దేవీ వైభవం.. ఉత్సవ శోభితం

దేవీ వైభవం.. ఉత్సవ శోభితం2
2/2

దేవీ వైభవం.. ఉత్సవ శోభితం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement