26న రైతు, కార్మిక సంఘాల మహా ప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): ఈనెల 26న కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు చేపట్టే కార్మిక, రైతు సంఘాల మహాప్రదర్శను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప కోరారు. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు ఉంటాయన్నారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోసం చేశారన్నారు. 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తేవడంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులను కార్పొరేటర్లకు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. నిధులు, పని దినాలు తగ్గించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రపన్నిందన్నారు. సమావేశంలో నాయకులు జి.చంద్రశేఖర్, టి.రామాంజనేయులు, ఈశ్వర్, డీసీ రహమాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment