ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు లాగిన్‌లో పరిశీలన చేసి తగు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. కొన్ని శాఖల అధికారులు వచ్చిన అర్జీలను చూడడంలేదని, ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సిబెళగల్, వెల్దుర్తి, మద్దికెర, గూడూరు, ఎమ్మిగనూరు, కర్నూలు ఆర్‌డీఓలు ఐదు రోజుల వరకు, జిల్లా మైనార్టీ శాఖ అధికారి 7 రోజులైనా అర్జీలను చూడకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోని ఎంఈఓ తన లాగిన్‌కు వచ్చిన అర్జీలను 14 రోజులైనా చూడకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులకు సంబంధించి పత్తికొండ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే 6 కేసులు, సీఎంఓకు సంబంధించి 10 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చిరంజీవి, కొండయ్య పాల్గొన్నారు.
● అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశ్రీ నిధుల కోసం కొన్ని ఆసుపత్రులు మహిళల ప్రాణాలతో చెలగాటమడుతున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నగర కార్యదర్శి తిరుపాల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న భాష్యం పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కోరారు.
లాగిన్‌లో వచ్చిన అర్జీలను
ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment