అగ్నిప్రమాదంతోనే బాలిక మృతి
నందికొట్కూరు: స్థానిక బీఆర్‌ఆర్ నగర్‌లో సోమవారం ఇంటర్ విద్యార్థి మంటల్లో ఆహుతైన ఘటనకు అగ్నిప్రమాదమే కారణంగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట జెడ్పీ హైస్కూల్‌లో మృతురాలు, ఇదే ఘటనలో గాయపడిన యువకుడు 10వ తరగతి వరకూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత బాలిక నందికొట్కూరులోని తాత దగ్గర ఉంటూ స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్‌లో చేరింది. ఆ యువకుడు అప్పుడప్పుడూ ఆమె కోసం నందికొట్కూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీ రాత్రి సుమారు 11 గంటలకు బీఆర్‌ఆర్ నగర్‌లోని బాలిక ఇంటివద్దకు యువకుడు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి దోమల నివారణకు ఉపయోగించే జెట్ కాయిల్ అంటించుకొని నిద్రించారు. ఆ సమీపంలోనే పెయింట్‌లో కలిపే టిన్నర్ మూత లేకుండా ఉండింది. వీరు నిద్రిస్తున్న సమయంలో దుప్పటి ప్రమాదవశాత్తు టిన్నర్‌కు తగలడంతో అది కిందకు ఒలికి జెట్ కాయిల్‌కు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నిద్రలో ఉన్న బాలికకు మంటలు అంటుకున్నాయి. అప్పటికే గది లోపల గడియ వేసుకోవడంతో వారు బయటకు రాలేకపోయారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో బాలిక శరీరమంతా కాలి అక్కడికక్కడే చనిపోయింది. గాయాలతో బయటపడిన యువకుడు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకూ చేసిన దర్యాప్తు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా తేలిందని ఎస్పీ తెలిపారు. అన్ని రకాల రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నందున అవి వచ్చిన తర్వాత కేసులో తదుపరి చర్య ఉంటుందని చెప్పారు. కాగా, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అంతకుముందు సంఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించారు. సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు నాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు తిరుపాల్, ఓబులేసు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
టిన్నర్‌కు జెట్ కాయిల్ తగలడంతో
మంటలు
మంచానికి మంటలు వ్యాపించడంతో
బాలిక సజీవ దహనం
విలేకరుల సమావేశంలో
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment