మల్లయ్యా.. గందరగోళం ఏందయ్యా!
● ఈనెల 3న స్పర్శ దర్శనాలు రద్దు చేస్తూ దేవస్థానం నిర్ణయం ● స్వర్శ దర్శనాలు పునరుద్ధరిస్తూ ఈఓ తాజా నిర్ణయం ● అయోమయంలో భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో భక్తుల్లో గందరగోళం నెలకొంది. రోజుకో అధికారి, పూటకో నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. ఈనెల 3న అప్పటి ఈఓ ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్ రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని రద్దు చేసి భక్తులందరికీ అలంకార దర్శనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇటీవల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీనివాసరావు రద్దీ రోజుల్లో మూడు విడతల మల్లన్న స్పర్శ దర్శనాలను పునరుద్ధరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీశైల మల్లన్న భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 7న వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి, భక్తుల విజ్ఞప్తుల మేరకు రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ సెలవు రోజులు, శని, ఆది, సోమవారాల్లో మూడు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రద్దు చేసిన స్పర్శ దర్శనాలను పునరుద్ధరించారు. అయితే గత ఈఓ ఎస్‌ఎస్ చంద్రశేఖర ఆజాద్ ఇదే వైదిక కమిటీతో చర్చించి స్పర్శ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు మల్లన్న దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజులు గడవకముందే గత ఈఓ నిర్ణయాన్ని రద్దు చేసి నూతన ఈఓ స్పర్శ దర్శనాలు పునరద్ధరించడంతో సాధారణ భక్తులు అయోమయంలో పడ్డారు.
భక్తుల విజ్ఞప్తి మేరకే పునరద్ధరణ
శని, ఆది, సోమవారాల్లో, ప్రభుత్వ సెలవు దినాలు మొదలైన రద్దీ రోజుల్లో నిర్దిష్ట వేళల్లో మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకే పునరద్ధరణ నిర్ణయం తీసుకున్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసారావు తెలిపారు. మంగళవారం ఈఓ మాట్లాడుతూ సర్వ దర్శనం క్యూలైన్లలోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోజుకు మూడు విడతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. గతంలో మాదిరిగానే స్పర్శ దర్శనం టికెట్లను అన్‌లైన్ ద్వారా మాత్రమే పొందాలన్నారు.
దర్శనాల వివరాలు..
ఉదయం 4.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారి అలంకార దర్శనం.
ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం
ఉదయం 9.30 నుంచి 11.45 గంటల వరకు స్వామివారి అలంకార దర్శనం.
ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం
మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి అలంకార దర్శనం.
సాయంత్రం 4 గంటలకు ఆలయ శుద్ధి
సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామివారి అలంకార దర్శనం
రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం.
Comments
Please login to add a commentAdd a comment