ధర ఢమాల్
పత్తికొండ(తుగ్గలి): గిట్టుబాటు ధరలు కల్పిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మాటల్లోనేనని తేలిపోతోంది. అసలే ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు ప్రతికూల వాతావరణంతో దెబ్బతిని దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. టమాట పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. మూడు రోజులుగా టమాట ధరలు అమాంతం పడి పోయా యి. వాతావరణం ప్రతికూలం, అధిక వర్షాలు, తెగుళ్ల సోకి పంట దెబ్బ తినింది. ఉన్న పంటను అష్టకష్టాలు పడి వేలకు వేలు ఖర్చుచేసి కాస్త కాపాడుకున్నారు. అయితే ఒక్క సారిగా ధరలు పడిపోవడం రైతులను కలవరానికి గురి చేస్తోంది. సాగు చేసేందుకు పడిన కష్టం, పెట్టుబడులు అటుంచితే టమాటలు తెంచిన కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
కష్టం ఖర్చులకు కూడా రావడం లేదు..
పత్తికొండ పరిసర ప్రాంతాల్లో టమాట పండించిన రైతులు నిత్యం పత్తికొండ మార్కెట్‌కు తరలిస్తుంటారు. మార్కెట్‌లో టమాట ధరలు అమాంతం పడి పోవడం రైతులకు దిక్కుతోచడం లేదు. సోమవారం మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల దాకా సరుకు రాగా 25 కిలోల గంప రూ.30 నుంచి రూ.70 వరకు ధర పలకడంతో రైతులు విస్తుపోతున్నారు. మంగళవారం ఈ ధర కాస్త మెరుగు పడింది. జత గంపలు రూ.100 నుంచి రూ.200 దాకా ధర పలికింది. టమాటాలు తెంచేందుకు ఒక్కో కూలీకి రూ.300 కూలీ ఇస్తున్నామని, మార్కెట్ తరలించేందుకు గంపకు రూ.20 చొప్పున ఆటో బాడుగు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇంత కష్టపడి టమాట సరుకు మార్కెట్‌కు తీసుకొస్తే ధర లేకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలోన్నర రూ.30కిపైగా విక్రయిస్తుండగా తమకు మాత్రం కిలోకు రూ.2 కూడా రావడం లేదని, పండించిన తమ కంటే దళారులకే లాభాలు వస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు.
మూడు రోజులుగా అమాంతం పడిపోయిన టమాట ధర
25 కేజీల జత గంపలు రూ.100 నుంచి రూ.200
పెట్టుబడులు కూడా రావడం లేదని రైతుల ఆందోళన
కిలో @ రూ.2
ప్యాపిలి: స్థానిక టమాట మార్కెట్‌లో మంగళవారం కిలో టమాట రూ.2 చొప్పున పలికింది. 25 కిలోల బాక్స్‌ను వ్యాపారులు రూ.50కి కొనుగోలు చేయడంతో రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఖర్చులు కూడా చేతికిరాకపోవడంతో సరుకు వదిలి వెళ్తున్నట్లు రైతులు తిమ్మరాజు, రాజేశ్, సుంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment