అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 28 తులాల బంగారం రికవరీ
కర్నూలు: ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన హనుమంతు కర్నూలుతోపాటు బళ్లారిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. కర్నూలు శివారులోని రిచ్‌మండ్ విల్లాస్‌లో నివాసముంటున్న నాగార్జున, విష్ణు టౌన్‌షిప్‌లో నివాసముంటున్న వెంకటేష్ ఇళ్లల్లో చోరీలు జరిగాయి. వేలి ముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించి పక్కా ఆధారాలతో హనుమంతును అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేరాల చిట్టా బయట పడింది. అతని వద్ద నుంచి 28 తులా ల బంగారు నగలు స్వాధీనం చేసుకుని మంగళవారం కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. నాలుగో పట్టణ సీఐ మధుసూదన్‌గౌడ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. హనుమంతుపై కర్ణాటక రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో దొంగతనాల కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. జల్సాలు, జూదం, వ్యభిచారానికి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. యజమానులు ఇంటి తలుపులు వేసి బయటకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, డబ్బు ఇంట్లో ఉంచుకోరాదని డీఎస్పీ సూచించారు. సీసీ కెమెరాలతో పాటు వాచ్‌మెన్లు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకుని దొంగతనాల నివారణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్‌ఐలు గోపీనాథ్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment