● ఆర్గానిక్ పరీక్ష నిమిత్తం నమూనాల సేకరణ ● గుంటూరు ల్యాబ్ ఫలితాల విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్) కార్యక్రమాలను వ్యవసాయ శాఖ చేపట్టింది. పత్తికొండ, ఆలూరు మండలాల్లో వేరుశనగలో గ్యాప్ పొలంబడి కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ పద్ధతులతో ఈ ఖరీఫ్‌లో పండించిన వేరుశనగలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అధికారులు వచ్చి రికార్డులను పరిశీలించి శాంపిల్స్ తీసి గుంటూరు ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ పక్షీక్షించగా అన్నింటిలోనూ కెమికల్స్ మోతాదుకు మించి ఉన్నట్లు నిర్ధారణ అయింది. గ్యాప్ పొలంబడి పద్ధతులతో పండించిన వేరుశనగలో ఆప్లాటాగ్జిన్ కెమికల్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఈ రెండు మండలాల నుంచి వెళ్లిన అన్ని శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి.
కొర్రలో కెమికల్స్ లేవని నిర్ధారణ
వెల్దుర్తి, తుగ్గలి మండలాల్లో గ్యాప్ పొలంబడి కార్యక్రమానికి అనుగుణంగా కొర్ర సాగు చేశారు. వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం, మండల కేంద్రమైన తుగ్గలిలో గ్యాప్ పద్ధతులకు అనుగుణంగా కొర్ర సాగు చేశారు. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ అధికారులు వచ్చి వెల్దుర్తి మండలంలో 15, తుగ్గలి మండలంలో 3 శాంపిల్స్ తీసి గుంటూరు లాం ల్యాబ్‌కు పంపారు. అక్కడ పరీక్షించగా.. కెమికల్స్ లేవని నిర్ధారణ అయింది. అన్ని శాంపిల్స్ ల్యాబ్‌లో పాస్ అయ్యాయి. ఈ విషయాన్ని లాం ప్రయోగశాల సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. త్వరలో కొర్రకు ఆర్గానిక్ సర్టిఫికెట్స్ రానున్నాయి. చిరుధాన్యమైన కొర్రలో సహజంగా కెమికల్స్ వినియోగం అతి తక్కువగా ఉంటుంది. కంది, వరిలో ఇంకా గ్యాప్ పొలంబడి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment