దేవస్థాన ఉద్యోగులకు పదోన్నతులు
శ్రీశైలంటెంపుల్: పలువురు ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షకులు కె.వెంకటేశ్వరరావు, కె.సాయికుమారికి సహాయ కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొందారు. సీనియర్ అసిస్టెంట్లు హరికృష్ణారెడ్డి, రంగన్న, నాగేశ్వరరావు, ఆర్.మల్లికార్జున, ఎం.శ్రీనివాసరావులకు పర్యవేక్షకులుగా పదోన్నతులు లభించాయి. పదోన్నతులు పొందిన ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మర్యాదపూర్వకంగా దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సహకార సంఘాల సభ్యులకు ఈ–కేవైసీ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) సభ్యులైన రైతులందరు ఈ–కేవైసీ చేయించుకోవాలని జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరాలన్నా, డీబీటీ ద్వారా నగదు బదిలీ జరగాలన్నా, ఇతర ప్రయోజనాలు పొందాలన్నా ఈ–కేవైసీ తప్పని సరి అన్నారు. జిల్లాలోని 43 పీఏసీఎస్‌లలో 73,462 మంది రైతులు రుణాలు తీసుకొని సభ్యులుగా ఉన్నారన్నారు. సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేసి మినీ బ్యాంకులుగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రైతుల ఈ–కేవైసీకి ప్రాధాన్యత పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఈ–కేవైసీ చేయించుకునే అవకాశాన్ని సహకార శాఖ కల్పించిందని, రైతులు ఆధార్ కార్డుతో సచివాలయానికి తీసుకెళ్లి ఈ–కేవైసీ చేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు 14 వేల మంది రైతులు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకున్నారన్నారు.
31లోగా ఈ–కేవైసీ చేయించుకోండి
పసుపల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులుగా ఉన్న రైతులు ఈనెల 31లోగా ఈ–కేవైసీ చేయించుకోవాలని ముఖ్య కార్యనిర్వహణ అధికారి మురళీధర్‌చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌లో విలేకరులతో మాట్లాడారు. సంఘంలో 3 వేలకుపైగా రైతులు సభ్యులుగా ఉన్నారని, సొసైటీని కంప్యూటరీకరణ చేస్తున్నందున సభ్యులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment