శనగ పంటలో నీటి నిల్వలు ఉండనీయొద్దు
నంద్యాల(అర్బన్): శనగ పంటలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటే అధిక దిగుబడులు వస్తాయని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ అన్నారు. ఇటీవల శనగ పంటకు ఎండుతెగులు, మొదలు కుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించాయని, వాటి నివారణకు ప్రతి మూడేళ్లకోసారి రైతులు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. డీఏఓ మురళీకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయాధికారులు పాల్గొన్న సమావేశంలో డీఏఓ జాన్సన్ మాట్లాడుతూ వంద కిలోల పశువుల ఎరువులో 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, 4 కిలోల వేపచెక్క నేలలో వేసి కలియదున్నాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ శనగ పంట సాగుకు ముందు నేలను ఖాళీగా ఉంచకుండా సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తే భూమి సారవంతమవుతుందన్నారు. కర్నూలు ఇన్‌చార్జ్ డీఏఓ అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
బెల్లం ఊట ధ్వంసం
ఆత్మకూరు: మండలంలోని సిద్ధపల్లె డొంకలో శనివారం నాటుసారా తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ డీవీ నారాయణ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఎవరైనా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారీ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment