రిజర్వాయర్ భూములను ఆక్రమిస్తే చర్యలు
అవుకు: ఎవరైనా రిజర్వాయర్ భూములను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని డోన్ ఆర్డీఓ నరసింహులు హెచ్చరించారు. అవుకు సమీపంలోని రిజర్వాయర్‌ను ఆనుకొని కొందరు నాపరాతి డిపోలు ఏర్పాటు చేసుకోవడమేకాక నిరుపయోగ రాళ్లను రిజర్వాయర్‌లో వదిలేస్తున్నారు. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న డోన్ ఆర్డీఓ నరసింహులు శనివారం ఎస్సార్బీసీ ఈఈ సురేష్ బాబుతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ పరిధిలో ఉన్న భూమి ఎంతవరకు ఆక్రమణకు గురైంది, ఏయే సర్వేనంబర్లలో ఎంత భూమి ఉంది, ఆక్రమణదారులు ఎవరు తదితర వివరాలతో పూర్తి నివేదిక సిద్ధం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించి డిపోలను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఆక్రమణదారులు ఖాళీ చేయాలన్నారు. ఇప్పటికే చెర్లోపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఆక్రమణదారుల్లో అవుకు గ్రామానికి చెందిన గండ్రాయుడు, ఎర్రమల రామక్రిష్ణ, షేక్ అబ్దుల్లా(లంబు బాషా), ప్రేమ్ కుమార్, ఎస్‌ఎండీ హుస్సేన్, మహబూబ్‌పీరాలకు, అలాగే చెర్లోపల్లెకు చెందిన ఎం నాగపుల్లయ్య, కంబగిరి, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, చాకలి మద్దిలేటి, వడ్డె గుర్రప్ప, కండక్టర్ పుల్లయ్య, ఉపేంద్రలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, ఆర్‌ఐ వెంగల్ రెడ్డి, ఎస్సార్బీసీ సిబ్బంది , అవుకు పోలీసులు పాల్గొన్నారు.
సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ
రిజర్వాయర్ భూముల్లో అక్రమంగా డిపోలను ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి శనివారం ఆక్రమణ ప్రదేశం వద్దకు రాకపోవడంతో ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆక్రమణదారుల్లో అవుకు గ్రామానికి చెందిన ఎర్రమల రామక్రిష్ణ నోటీసు తీసుకోలేదని ఆర్డీఓకు తెలియడంతో చెర్లోపల్లె వీఆర్‌ఓ సుబ్బరాయుడుపై మండిపడ్డారు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అతికించటం లేదా ఆక్రమణదారుడి వాట్సాప్‌కు నోటీసులు పంపించాలనే విషయం కూడా తెలియదా అంటూ వీఆర్‌ఓపై మండిపడ్డారు. త్వరగా అతనికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment