ముగిసిన రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలు
● హోరాహోరీగా ఫైనల్ పోటీ ● బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ప్రకాశం, కర్నూలు జట్లు
పొదిలి రూరల్: పొదిలి ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న 28వ రాష్ట్ర స్థాయి జూనియర్ సెపక్‌తక్రా ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. పోటీలకు వివిధ జిల్లాల నుంచి బాలురు, బాలికలు కలిపి మొత్తం 32 జట్లు పోటీలో పాల్గొన్నాయి. శనివారం నిర్వహించిన సెపక్‌తక్రా పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం – కర్నూలు జట్లు నువ్వా–నేనా అన్న విధంగా తలపడ్డాయి. ఈ పోరులో ప్రకాశం జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతి ప్రకాశం జట్టు, రెండో బహుమతి కర్నూలు జట్టు సొంతం చేసుకున్నాయి. మూడో బహుమతికి అనంతపురం, ఈస్టుగోదావరి జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. బాలికల విభాగంలో మొదటి బహుమతి తూర్పుగోదావరి జట్టు కై వసం చేసుకోగా, రెండో బహుమతిని ప్రకాశం జిల్లా జట్టు సొంతం చేసుకుంది. మూడో బహుమతికి విజయనగరం, అనంతపురం జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జీ శ్రీనివాసులు, అమరనాథ్, మధు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment