No Headline
సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం
గత ప్రభుత్వం చేసింది 20శాతం పనులే..
ప్రాజెక్టుల సందర్శనలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేసి, కరువు జిల్లాగా పేరున్న పాలమూరును సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలసి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను బుధవారం సందర్శించారు.
మొదటగా మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్ రిజర్వాయర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు రిజర్వాయర్, వనపర్తి జిల్లాలోని శంకరసముద్రం రిజర్వాయర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కేఎల్‌ఐ పంప్‌హౌజ్ ఔట్‌లెట్, పాలమూరు ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటరీలను పరిశీలించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కేఎల్‌ఐ మోటార్లను అధికారులు ప్రారంభించగా.. మెయిన్ కెనాల్ ద్వారా నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. కరువు జిల్లాగా పేరొందిన జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డి, కేఎల్‌ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గట్టు ఫేజ్–2 ప్రాజెక్ట్‌లను వందశాతం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఇందుకోసం ఆర్థిక, నీటిపారుదల శాఖలను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తిచేశామని మూర్ఖంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలను మరమ్మతులు చేసి, వచ్చే వానాకాలం నాటికి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నట్లు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని 20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యానికి పెంచే విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్డీఎస్, మల్లమ్మకుంట సాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment