జిల్లా కబడ్డీ జూనియర్ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జనగామలో ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను ఈనెల 15న జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డు, పదోతరగతి మెమో, బోనఫైడ్‌తో హాజరుకావాలని సూచించారు.
నేడు జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో గురువారం జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఫాతిమా విద్యాలయంలో విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన నిర్వహణ కమిటీలతో మాట్లాడుతూ ఎగ్జిబిట్ చేసే ప్రతి ప్రదర్శన కూడా ఎంతో ముఖ్యమని, అందుకోసం వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అన్ని విషయాలపై వివిధ స్థాయిల్లో పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో సైన్స్ అధికారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శంభూప్రసాద్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు మార్కెట్‌లో ధాన్యం టెండర్లు
నవాబుపేట/దేవరకద్ర: నవాబుపేట మార్కెట్ యార్డులో అధికారులు ఎట్టకేలకు బుధవారం టెండర్లు నిర్వహించారు. ఇక్కడ వారం రోజుల నుంచి టెండర్లు జరగకపోవడంతో మార్కెట్ చైర్మన్ లింగం చొరవ తీసుకుని టెండర్లు జరిగేలా చేశారు. కాగా బుధవారం మార్కెట్‌లో 38,459 బస్తాల ధాన్యానికి టెండర్లు వేయగా.. వరి క్వింటాల్ గరిష్టంగా రూ.2,788, కనిష్టంగా రూ.2,720 ధర వచ్చిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు. అయితే ధాన్యం మొత్తం తూకాలు వేసి ఎగుమతి చేయడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,700
దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.2,500 చొప్పున ధరలు నమోదయ్యాయి. సీజన్ తగ్గడంతో మార్కెట్‌కు కేవలం 200 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
చిన్నరాజమూర్ హుండీ లెక్కింపు
దేవరకద్ర: చిన్నరాజమూర్ శ్రీఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హుండీని లెక్కించారు. దేవస్థాన కమిటీతోపాటు ఎండోమెంట్ అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీని లెక్కించగా రూ.4,17,410 వచ్చాయి. హుండీ ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ రాఘవేంద్రచారి తెలిపారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ముందస్తుగా హుండీని లెక్కించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత మరోసారి హుండీ లెక్కింపు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు హన్మేషచారి, జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, ప్రేమ్‌కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment