భక్తులతో పోటెత్తిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. ఇదిలాఉండగా, ఆదివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగగా.. భాజా భజంత్రీలు.. మేళతాళాలు.. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఇక సోమవారం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నెలరోజులపాటు స్వామివారికి దాసంగాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. వాటిలో భక్తులు బారులు తీరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసు, చంద్రశేఖర్‌రావు, నాగరాజు శర్మ, బాబురావు, అరవిందరావు, వాల్మీ కి పూజారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment