భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం
● కపిలగోవుకు ప్రత్యేకపూజలు
● భక్తులతో పోటెత్తిన అలంపూర్ క్షేత్రం
అలంపూర్ : శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఆరుద్రోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్గశిర మాసం అందులో సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం కలిసిరావడంతో ఈ ఆరుద్రోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ముందుగా కపిల గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాకార ప్రదక్షిణలు, దర్బార్ సేవలు జరిగాయి. ఆలయంలోని రససిద్ధి గణపతికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు చేశారు. భక్తులతో వేదపండితులు పారాయణాలు చదివించారు.
రథోత్సవం
శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై కొలువుదీర్చి సేవలు నిర్వహించారు. ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు హరహర మహాదేవా.. శంభోశంకర అంటూ ఆలయం చుట్టూ రథాన్ని లాగారు. దర్బార్ సేవలు, మహామంత్ర పుష్పాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment