విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డుపై విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని హబీబ్‌నగర్‌కు చెందిన ఎండీ జహంగీర్ పాష(44) సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మార్కెట్‌లో కూరగాయలు తీసుకుని.. అలీస్ మార్ట్ దుకాణంలో నిత్యావసర సామగ్రి తీసుకోవడానికి ద్విచక్రవాహనం నిలిపి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం దగ్గర వైర్లకు తగిలి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జహంగీర్‌పాష సోదరుడు రహీంపాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తల్లిదండ్రులు
మందలించడంతో
● యువకుడి బలవన్మరణం
ఆత్మకూర్: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఉరి వేసుకుని బలవన్మరరణానికి పాల్పడిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేందర్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఆత్మకూర్‌లో నివాసముంటున్న కాసోజు రవికుమార్, సునీత దంపతుల రెండో కుమారుడు నితీష్‌కుమార్ పదో తరగతి వరకు చదివి మూడేళ్లుగా బెంగళూరులో గ్లాస్‌వర్క్ చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం ఆత్మకూర్‌కు వచ్చిన నితీష్ జులాయిగా తిరుగుతుండడంతో.. ఏదైనా పనిచేసుకోవాలని లేదా బెంగళూరుకు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. ఆదివారం గురుపౌర్ణమి ఉండడంతో కుటుంబ సభ్యులందరూ మక్తల్‌లోని దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న నితీష్ ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటికి తిరిగి రాగా.. నితీష్ ఎంతసేపటికి తలుపులు తెరువకపోవడంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా నితీష్ దూలానికి వేలాడుతు కనిపించాడు. స్తానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే నితీష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
రైలు కింద పడి మహిళ ఆత్మహత్యాయత్నం
జడ్చర్ల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బాదేపల్లి పాతబజార్‌కు చెందిన సరిత ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సిగ్నల్‌గడ్డ బ్రిడ్జి దగ్గర రైలు పట్టాలపైకి చేరుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వెళ్తున్న రైలుకు సిగ్నల్‌గడ్డ వద్ద పట్టాలపై మహిళ అడ్డుగా రావడంతో లోకోపైలెట్ గమనించి రైలును నిలిపివేశాడు. మహిళకు అంగుళం దూరంలో రైలు నిలిచిపోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చుట్టు పక్కల వారు వచ్చి మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళ భర్త కృష్ణ వేధింపుల భరించలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది. అనంతరం తెలిసిన బంధువుల ఆ టోలో బాధిత మహిళను ఇంటికి తీసుకెళ్లారు.
భార్యపై భర్త దాడి..
కేసు నమోదు
నాగర్‌కర్నూల్ క్రైం : భార్యపై భర్త దాడి చేసిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. నాగనూలు గ్రామానికి చెందిన నితిన్ అతని భార్య చంద్రకళపై ఈనెల 15న మద్యం మత్తులో దాడి చేశాడు. దాడిలో చంద్రకళకు గాయాలయ్యాయి. చంద్రకళ సోమవారం స్థానిక పో లీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
లక్ష్మీనగర్‌కాలనీలో
దొంగ హల్‌చల్
● స్కూటీ ఎత్తుకెళ్లి ముళ్లపొదల్లో వదిలేసిన వైనం
మహబూబ్‌నగర్ క్రైం: పట్టణంలోని లక్షీనగర్‌కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశాడు. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని తాళం పగలగొట్టి కొంత దూరం తీసుకెళ్లి ముళ్లపొదల్లో వదిలేశాడు. అంతకుముందు దొంగ కొన్ని ఇళ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దొంగతనం కోసం ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ కాలనీలో ఓఇంటికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఏరియాలో ఇటీవలే ఐదుగురు యువకులు చెడ్డీలపై తిరుగుతూ హల్‌చల్ చేశారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్న పోలీసులు దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment