మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్ చేస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: త్వరలోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికారులు తయారు చేస్తున్నారన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు వస్తాయన్నారు. అవసరమైతే ఎంపీ డీకే అరుణను సంప్రదించి వివిధ పథకాల కింద ఎక్కువ నిధులు రాబడతామన్నారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ప్రభుత్వ వైద్య, విద్యా సంస్థలలో కాంగ్రెస్ పార్టీ తరపున శ్రమదానం చేస్తామన్నారు. ‘ఇది ప్రజా ప్రభుత్వమని, పాలకులం కాదు.. సేవకులం.. సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా తామంతా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నామ’ని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పదవుల్లో ఉన్నవారు సైతం శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. వీలైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాజకీయం అంటే సేవ చేయడం, ప్రజల్లో మమేకమై వారి సమస్యల్ని పరిష్కరించడం.. అని ఆనాడే మహాత్మాగాంధీజీ చెప్పారన్నారు. అయితే గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలను భయపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం, దౌర్జన్యం చేయడం జరిగిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు, అధికారులు ఎలాంటి భయాందోళన లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారన్నారు. త్వరలోనే ముడా, మున్సిపల్ చైర్మన్లు కె.లక్ష్మణ్‌యాదవ్, ఎ.ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్‌అహ్మద్‌తో పాటు పార్టీ నాయకులందరూ కలిసి ప్రతి వార్డులో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, సీజే బెన్‌హర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment