ఈ–చలాన్స్‌పై నజర్
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఈ ఏడాది నమోదైన ఈ–చలాన్, ఎంవీఐ యాక్ట్ పెండింగ్ కేసులలో వాహనదారుల నుంచి జరిమానాల వసూలుకు పోలీస్‌శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. వారం రోజులుగా ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం వేళలలో తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ పోలీసులతోపాటు వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసులు వేర్వేరు బృందాలుగా పట్టణం నలువైపులా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనం నంబర్‌పై పెండింగ్ ఈ–చలాన్స్ ఉన్నాయా.. లేదా అని పరిశీలించి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రెండేళ్లు ప్రత్యేక రాయితీలు
గతంలో రెండేళ్లపాటు ప్రభుత్వం అన్ని రకాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై ప్రత్యేక రాయితీలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ–చలాన్స్ అధికంగా ఉండటంతో వాహనదారుల నుంచి జరిమానాలు రాబట్టడం కోసం పోలీస్ శాఖ భారీ రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి.. పెండింగ్ చలాన్స్ వసూలు చేశారు. దీంతో కొందరు వాహనదారులు సైతం స్వచ్ఛందంగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నారు. మరి ఈ ఏడాది కూడా వాహనదారుల నుంచి పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తారా.. లేదా.. అనేది వేచిచూడాల్సి ఉంది.
17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో..
జిల్లాలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 1,49,142 కేసులు పెండింగ్‌లో ఉండగా వీటి నుంచి రూ.6,94,88,795 జరిమానా వసూలు కావాల్సి ఉంది. ఇందులో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి 7,641 కేసులు ఉండగా రూ.62,38,365 జరిమానాలు ఉన్నాయి. అలాగే హన్వాడ పరిధిలో 2,959 కేసులకు గాను రూ.10,35,030, కోయిలకొండలో 1,500 కేసులకు రూ.4,22,750, నవాబ్‌పేటలో 1,502 కేసులకు రూ.10,90,560, మహమ్మదాబాద్‌లో 2,267 కేసులకు రూ.12,63,965, బాలానగర్‌లో 5,017 కేసులకు రూ.21,56,905, మిడ్జిల్‌లో 2,887 కేసులకు రూ.8,54,540, రాజాపూర్‌లో 6,261 కేసులకు రూ.25,14,430, భూత్పూర్‌లో 13,176 కేసులకు రూ.1,11,16,945 రాబట్టాల్సి ఉంది. అడ్డాకుల పరిధిలో 5,214 కేసులకు గాను రూ.26,24,540, మూసాపేటలో 8,850 కేసులకు రూ.48,17,995, దేవరకద్రలో 2,256 కేసులకు రూ.13,61,670, చిన్నచింతకుంటలో 1,664 కేసులకు రూ.3,90,865, మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌లో 7,931 కేసులకు రూ.71,01,435, టూటౌన్‌లో 6,848 కేసులకు రూ.26,36,420, ట్రాఫిక్‌లో 6,183 కేసులకు రూ.1,48,27,835, జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 11,334 కేసులకు గాను రూ.90,34,545 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బృందాల ఏర్పాటు
పెండింగ్ చలాన్స్ చెల్లించే విధంగా దృష్టి
ఈ ఏడాది లక్షకుపైగా కేసుల్లో రూ.7 కోట్ల జరిమానా విధింపు
ఇప్పటికే 2,141 కేసుల్లో రూ.97 లక్షలు వసూలు
Comments
Please login to add a commentAdd a comment