కనీస వేతనం అమలు చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఆశావర్కర్లకు కనీస వేతనం ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం బస్సుజాతా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ టౌన్‌హాల్ సభలో ఆయన మాట్లాడుతూ.. బస్సుజాతా ముగింపులోగా ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీస వేతనాలు అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా, ఉద్యోగ భద్రత, సాధారణ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు 60 శాతం వేతనాలను ప్రకటించకపోతే పార్లమెంట్‌ను సైతం ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, నాయకులు ఎ.రాములు, నల్లవెల్లి కురుమూర్తి, వెంకట్రాములు, బాలమణి, ఎన్.పద్మ, సాధన, గంగామణి, చంద్రకాంత్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతు దంపతులకు పుడమిపుత్ర అవార్డు
మహమ్మదాబాద్: సేంద్రియ వ్యవసాయంతో భూసారం, ప్రజల ఆరోగ్యం పరిరక్షిస్తున్న రైతు మాచారం గోపాల్‌రెడ్డి – యశోద దంపతులు పుడమిపుత్ర అవార్డు అందుకున్నారు. మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్‌కు చెందిన వీరు సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటు తోటి రైతులకు సేంద్రియ పద్ధతులపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి యాదాద్రి జిల్లాలో నిర్వహించిన జాతీ యగాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా గోపాల్‌రెడ్డి – యశోద దంపతులకు పుడమిపుత్ర అవార్డులను ప్రదానం చేశారు. పది రాష్ట్రాల నుంచి 115 మంది రైతులు అవార్డుకు ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి తాము పుడమిపుత్ర అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని గోపాల్‌రెడ్డి తెలిపారు.
మార్కెట్‌కు భారీగా ధాన్యం
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్‌కు వరి ధాన్యం భారీగా వచ్చి చేరింది. ఆదివారం 27,981వేల బస్తాలకు పైగా ధాన్యం రావడంతో యార్డు కిక్కిరిసింది. వ్యాపారులు ధర ఎక్కువగా వేస్తుండటంతో అందరూ మార్కెట్ కు ధాన్యాన్ని తరలించారు. ధాన్యానికి కనిష్ట ధర రూ.2758, గరిష్ట ధర రూ.2683 వచ్చిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment