స్టేషన్ మహబూబ్‌నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో రెండోసారి ఆదివారం ‘పదరా పోదాం మన్యంకొండ’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లాకేంద్రం బండ్లగేరిలో గల రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం నుంచి దాదాపు 800 మంది భక్తులు మన్యంకొండ దేవాలయానికి పాదయాత్రగా వెళ్లారు. బండ్లగేరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్‌టౌన్, బండమీదిపల్లి, పాలమూరు యూనివర్సిటీ, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవాలయం వరకు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు పాదయాత్రకు స్వాగతం పలికారు. లక్ష గోవింద నామస్మరణ, భజనలు, హరినామస్మరణతో భక్తియాత్ర మన్యంకొండ దేవాలయం వరకు కొనసాగింది. ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు మన్యంకొండ దేవాలయానికి చేరుకుంది. పాదయాత్రకు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదనాచారి స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవాహిని పరిషత్ వ్యవస్థాపకులు జ్యోషి సంతోషాచార్యులు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం రెండోసారి మన్యకొండకు పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షులు నాయిని భాగన్నగౌడ్, మన్యంకొండ దేవస్థానం బోర్డు సభ్యులు శ్రవణ్‌కుమార్, శాంతన్న, అంజయ్య, గంగాపురం పవన్‌కుమార్‌శర్మ, రామకృష్ణశర్మ, నరేష్, ధర్మవాహిని సభ్యులు పాల్గొన్నారు.
గోవింద నామస్మరణతో సాగిన పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment