‘సైబర్‌’ మాయ..! | - | Sakshi
Sakshi News home page

‘సైబర్‌’ మాయ..!

Published Tue, Dec 31 2024 1:20 AM | Last Updated on Tue, Dec 31 2024 4:14 PM

‘సైబర

‘సైబర్‌’ మాయ..!

దైనందిన జీవితంలో డిజిటలైజేషన్‌ వినియోగం పెరగడంతో ప్రజలు ఆన్‌లైన్‌, మొబైల్‌ సేవలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్ల్లు, లింక్‌లతో మభ్యపెట్టి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్‌ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో డబ్బులతో పాటు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మోసానికి గురైన వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్‌ మాయ కమ్మేసిన తీరు.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సైబర్‌ మోసాల కేసుల శాతం.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

● నారాయణపేట జిల్లా కేంద్రంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఇద్దరు గర్భిణుల బ్యాంక్‌ అకౌంట్ల నుంచి ఒకే రోజు డబ్బులు మాయమయ్యాయి. 14వ వార్డులోని అంగన్‌వాడీ–2 టీచర్‌కు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి హిందీలో మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్‌ వివరాలు కావాలని.. గర్భిణితో మాట్లాడుతానని చెప్పి వివరాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ గర్భిణి అకౌంట్‌లో రూ.25 వేలు మాయం కాగా.. ఇదే తరహాలో మరికల్‌లోని అంగన్‌వాడీ–5 సెంటర్‌కు చెందిన ఓ గర్భిణి అకౌంట్‌ నుంచి రూ. 3 వేలు మాయమయ్యాయి.

● గద్వాల పట్టణానికి చెందిన ఓ వైద్యురాలి మొబైల్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఈ ఏడాది జూలై 19న అపరిచితులు ఫోన్‌ చేసి నగదు సాయం చేయాలని కోరారు. ఆర్మీ క్యాంప్‌లో గర్భిణికి ఆరోగ్య సంరక్షణ సేవ నగదు సాయం కోసం వీడియో కాల్‌ చేశామని నమ్మ బలికారు. మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వచ్చిందనగా ఆమె నంబర్‌ చెప్పింది. వెంటనే ఆమె వ్యక్తిగత ఖాతాలో రూ.71,476 నగదు మాయమైంది. మోసపోయినట్లు గ్రహించిన ఆమె పట్టణ పోలీస్‌లను ఆశ్రయించగా.. కేసు నమోదు చేశారు.

● నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి ఫిబ్రవరి 2వ తేదీన అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను బ్యాంకు అధికారిగా చెబుతూ.. ఏటీఎం కార్డు రెన్యువల్‌ కోసం ఓటీపీ కావాలని అడిగాడు. బాధితుడు ఓటీపీ నంబర్‌ చెప్పగా ఆయన ఖాతాలోని రూ.6,99,000 మాయమయ్యాయి. షాక్‌ తిన్న బాధితుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.

జిల్లాల వారీగా నమోదైన సైబర్‌ నేరాలు ఇలా..

ఈ ఏడాది అమాయకుల నుంచి రూ.10 కోట్ల మేర దోపిడీ

ఉమ్మడిపాలమూరును బెంబేలెత్తిస్తున్న సైబర్‌ మోసాలు

గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిన 15.42 శాతంనేరాలు

అన్ని జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే స్వాధీనం

జిల్లా; 2023–24; 2024–25

మహబూబ్ నగర్; 951; 1,451

నాగర్ కర్నూల్; 442; 672

జోగుళాంబ గద్వాల; 278; 512

నారాయణపేట; 46; 25

వనపర్తి; 49; 64

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement