కన్నబిడ్డను చూపించడం లేదని తండ్రి ఆత్మహత్యాయత్నం
● బెల్లంపల్లిలో ఘటన
బెల్లంపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తలకు ఓ బిడ్డ జన్మించాక ఎడబాటు వచ్చింది. అప్పటినుంచి పుట్టిన బిడ్డను చూపించకుండా వేదనకు గురిచేస్తుండటంతో భర్త హెయిర్ డ్రై తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెల్లంపల్లిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం..మున్సిపాలిటీ టేకులబస్తీకి చెందిన బొల్లి సుమిత్‌చంద్ర 2001లో బూడిదగడ్డ బస్తీకి చెందిన వెంగళ శిరీషను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు అన్యోన్యంగా దాంపత్యం సాగించిన వీరికి పాప జన్మించింది. ఆ తర్వాత సంసారంలో కలతలు వచ్చాయి. అప్పటి నుంచి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. 2003లో భర్తపై భార్య బెల్లంపల్లి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ తర్వాత నుంచి భార్యభర్తలు కోర్టు వాయిదాలకు వెళ్తుండగా శిరీష ఉద్దేశపూర్వకంగా బిడ్డను తనకు చూపించకుండా తండ్రి ప్రేమకు దూరం చేస్తోందని కుమిలిపోతున్నాడు. గురువారం భార్యభర్తలు కోర్టుకు హాజరయ్యారు. బిడ్డ గుర్తుకురావడంతో వెంటనే బూడిదగడ్డ బస్తీలోఅత్తాగారింటికి వెళ్లి బిడ్డను చూపించాలని శిరీషతో గొడవపడ్డాడు. దీంతో శిరీష తాళ్లగురిజాల పోలీసుస్టేషన్‌కు వెళ్లి సుమిత్‌చంద్ర తనపై చేయిచేసుకోవడానికి వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. పోలీసులు అతన్ని మందలించారు. తనపై లేనిపోని కల్పితాలు చెప్పి పోలీసుల చేత చీవాట్లు తినిపించడంతో సుమిత్ చంద్ర తట్టుకోలేకపోయాడు. బిడ్డను చూపించకుండా వేధిస్తున్న భార్య శిరీష తీరుతో కలత చెందిన సుమిత్‌చంద్ర వెంట తెచ్చుకున్న హెయిర్ డ్రైని తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ముందు తాగి బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. పోలీసులు గమనించి అతన్ని అడ్డుకుని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment