బాసర ఆలయాభివృద్ధిపై దృష్టి
బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం బాసరలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నెలక్రితమే దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆలయానికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మరోసారి సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి సరస్వతీ అమ్మవారి గొప్పతనాన్ని దేశానికి చాటిచెప్పేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల అభివృద్ధి చేసినా జిల్లా ప్రజలు బీజేపీ అక్షింతలకే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశారని పేర్కొన్నారు. 11ఏళ్ల క్రితమే జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అగర్‌బత్తీలపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.వేల కోట్లు చెల్లిస్తున్నా ఆ స్థాయిలో రాష్ట్రానికి నిధులు రావడంలేదని విమర్శించారు. జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా కనీసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయించలేకపోయారని ఆరోపించారు. ఎన్నడూ లేనట్లు సన్నరకాలు పండించిన రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వంటగ్యాస్‌పై రూ.500 సబ్సిడీ కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులందరి పంటరుణాలు మాఫీ చేస్తామని, రైతు భరోసా తప్పకుండా వేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment