చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భీమారం: గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. భీమారం మండల కేంద్రానికి చెందిన ఆవుల ఓదెలు (43)కు బెల్లంపల్లి మండలం సండ్రవెళ్లికి చెందిన పద్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య, పిల్లలను పట్టించుకోక పోవడంతో పద్మ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఓదెలు తన తల్లివద్ద ఉంటున్నాడు. డిసెంబర్ 23న ఇంట్లోనే కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లి 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఆటోడ్రైవర్ మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నస్పూర్ మండలం సీసీసీ గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ గౌసొద్దీన్ (59)శుక్రవారం ఆటో నడుపుకుంటా మంచిర్యాల వైపు నుంచి సీసీసీకి వెళ్తుండగా చున్నంబట్టి బస్టాప్ వద్ద ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుకనుంచి ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
కందకంలో పడి వ్యక్తి మృతి
తాండూర్: కల్లు తాగేందుకు వెళ్లి కందకంలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్‌కు చెందిన పంచర్పుల శ్రీకాంత్ (30) మంచిర్యాలలో ఉంటూ మిషన్ భగీరథ పథకంలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం కల్లు తాగేందుకు మిత్రుడితో కలిసి బెల్లంపల్లిలోని కన్నాలకు వెళ్లాడు. అక్కడి నుంచి బుగ్గ దేవాలయ పరిసరాలకు వెళ్లి అటవీ అధికారులు తవ్వించిన కందకంలోపడి మృతి చెందాడు. కాగా శ్రీకాంత్ మృతిపై అనుమానం ఉందని అతని తండ్రి పోశం ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నిషేధాజ్ఞలు పొడిగింపు
మంచిర్యాలక్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే, డ్రోన్ కెమెరాలు వినియోగించడాన్ని నిషేధిస్తూ అమలులో ఉన్న నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 1 వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బీఎన్‌ఎస్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment