కోడి రె‘ఢీ’! | - | Sakshi
Sakshi News home page

కోడి రె‘ఢీ’!

Published Wed, Jan 8 2025 1:36 AM | Last Updated on Wed, Jan 8 2025 1:36 AM

కోడి

కోడి రె‘ఢీ’!

● జిల్లాలో జోరుగా కోడిపందేలు ● రహస్య స్థావరాల్లో నిర్వహణ ● గతేడాది 10 కేసులు నమోదు ● ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు

మంచిర్యాలక్రైం: ఒకప్పుడు ఆంధ్రకే పరిమితమైన కోడిపందేలు తెలంగాణకు చేరాయి. జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పందేలను కట్టడి చేసేందుకు పోలీసులూ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంక్రాంతికి మూడు నెలల ముందునుంచే జిల్లాలో ప్రత్యేక నిఘా పెట్టారు. గత అక్టోబర్‌ 4వ తేదీన కన్నెపల్లి మండలం మాడవెళ్లి పంచాయతీ పరిధి బొత్తుపల్లికి చెందిన బండి మధునయ్య (43) పందెం కోడికి కత్తి కడుతుండగా ప్రమాదవశాత్తు కత్తి కడుపులో దిగడంతో మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా పందేలను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత అప్రమత్తయ్యారు.

పట్టుబడ్డ ఘటనలు

● 2023 జనవరి 7న హాజీపూర్‌ మండలం పెద్దంపేట పంచాయతీ పరిఽధి కోలంగూడ శివారు అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కోడిపందేలు ఆడుతున్న 12మందిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ఏడు కత్తులు, 12 ద్విచక్రవాహనాలు, 12 సెల్‌ఫోన్లు, రూ. 26,400 నగదు స్వాఽధీనం చేసుకున్నారు.

● 2022 ఫిబ్రవరి 5న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన కొందరు పందెంరాయుళ్లు మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరీవాహక అటవీ ప్రాంతంలో రహస్యంగా కోడిపందేలు నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న కోటపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. 28 మందిని అదుపులోకి తీసుకుని నాలుగు పందెం కోళ్లు, ఐదు కత్తులు, ఏడు వాహనాలు రూ.1.51లక్షల నగదు, 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

చూపుడు పందేలే అధికం

కోడిపందేల్లో అనేక రకాలున్నప్పుటికీ జిల్లాలో అధి కంగా చూపుడు పందేలే ఆడుతుంటారు. బరిలోకి దింపే కోడి పుంజులను ముందే చూపించాల్సి ఉంటుంది. పుంజులకు కత్తులు కట్టించి, కత్తులు లేకుండా సాధారణ పందేలు నిర్వహిస్తుంటారు. పందెంలో సుమారు రూ.వెయ్యి నుంచి రూ.50వేల వరకు బెట్టింగ్‌ కాస్తుండటం గమనార్హం. పందేల్లో కత్తులు కట్టేవారికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ఒక్కసారి పుంజుకు కత్తి కట్టినందుకు వారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 తీసుకుంటారు. కత్తులను పందెం రాయుళ్లు ముందుగానే చైన్నె నుంచి తెిప్పించుకుంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి తెప్పించిన కత్తులు తేలికగా.. చాలా పదునుగా ఉంటాయి.

ప్రత్యేక నిఘా పెట్టాం

హైకోర్టు ఆదేశాల మేరకు కోడిపందేల నిర్వహణపై నిషేధం ఉంది. జిల్లాలో ప్రత్యేక బృందాలతో ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరైనా పందేలు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. కోడిపందేలు ఆడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు లేదా ‘డయల్‌ 100’ కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

– ఎం.శ్రీనివాస్‌, రామగుండం సీపీ

పందెం కోళ్లకు కట్టే కత్తులు (ఫైల్‌)

పందేలు నిర్వహించే ప్రాంతాలు

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఎలాగైనా కోడిపందేలు ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పందెం కోళ్లకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ప్రాణ హిత సరిహద్దు ప్రాంతాలైన కోటపల్లి, నీల్వా యి, వెంచపెల్లి, ఆల్గాం, రొయ్యలపల్లి, రాంపూర్‌, కన్నెపల్లి మండలం బొత్తుపల్లి శివారు, లక్సెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలను ఎంచుకుని కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కొందరు ప్రాణహిత సరిహద్దు దాటి మహా రాష్ట్రలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
కోడి రె‘ఢీ’!1
1/2

కోడి రె‘ఢీ’!

కోడి రె‘ఢీ’!2
2/2

కోడి రె‘ఢీ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement