స్వగ్రామం చేరిన మృతదేహం | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామం చేరిన మృతదేహం

Published Sat, Jan 25 2025 12:33 AM | Last Updated on Sat, Jan 25 2025 12:34 AM

స్వగ్

స్వగ్రామం చేరిన మృతదేహం

జన్నారం: ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన కుక్కటికారి రమేశ్‌ (47) మృతదేహం ఐదురోజులకు స్వగ్రామం చేరుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుక్కటికారి రమేశ్‌ గతేడాది ఉపాధి నిమిత్తం బెహరన్‌ వెళ్లాడు. ఈ నెల 20న పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం సాయంత్రం మృతదేహం ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య చంద్రిక, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కై లాస్‌నగర్‌(జైనథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై పురుషోతం తెలిపారు. మండలంలోని లక్ష్మింపూర్‌కు చెందిన కుష్నపెల్లి మహేష్‌ (23) బైక్‌పై ఇంటికి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

లారీ ఢీకొని మహిళ..

మందమర్రిరూరల్‌: పట్టణంలోని యాపల్‌ ప్రాంతానికి చెందిన పిల్లలమర్రి లలిత (58) లారీ ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. సదరు మహిళ పాత బస్టాండ్‌ ఏరియాలో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తుండగా మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

బైక్‌ పైనుంచి కిందపడి మహిళ..

జన్నారం: బైక్‌ పైనుంచి కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన టేకుమల్ల రజిత (35)కు లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంకు చెందిన సత్తయ్యతో వివాహమైంది. సత్తయ్య సోదరి భర్త ఇటీవల బెహరాన్‌లో మృతి చెందగా శుక్రవారం మృతదేహం స్వగ్రామం తిమ్మాపూర్‌ చేరుకుంది. అంత్యక్రియలకు హాజరైన రజితకు బీపీ తక్కువ కావడంతో ఆమె తండ్రి లింగన్న తాళ్లపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా బైక్‌కు కుక్క అడ్డురావడంతో కిందపడిపోయారు. మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త సత్తయ్య ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు.

గడ్డిమందు తాగి ఒకరు ఆత్మహత్య

నార్నూర్‌: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాన్కాపూర్‌కు చెందిన మహాత్మ చంద్రకాంత్‌ (21) వ్యవసాయంతో పాటు మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో గడ్డి మందు తాగడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. మృతునికి భార్య ప్రియాంక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ రహీం పాషా తెలిపారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

తాండూర్‌: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. చాకేపల్లి గ్రామానికి చెందిన జక్కుల మొండి (50) గురువారం చేపలు పట్టేందుకు అచ్చులాపూర్‌ గ్రామ శివారులో ఉన్న పెద్దమడుగుకు వెళ్లాడు. వల వేస్తుండగా ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులకు చుట్టుకోవడంతో మృతి చెందాడు. మృతుని తల్లి వెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పిచ్చికుక్క దాడిలో నలుగురికి గాయాలు

వేమనపల్లి: మండల కేంద్రంలో శుక్కవారం పిచ్చికుక్క నలుగురిపై దాడిచేయడంతో గాయాలయ్యాయి. జాలరివాడకు చెందిన కంపెల మల్లక్క, తొర్రేం వెంకటి, గాండ్ల వెంకటి, రాజారాం గ్రామానికి చెందిన మరో మహిళపై వేమనపల్లికి చెందిన ఓ గేదైపె దాడికి పాల్పడింది. గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. క్షతగాత్రులను 108లో చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మోసగించిన ఉపాధ్యాయుడు అరెస్ట్‌

జన్నారం: స్కీంలో పెట్టుపడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపి మోసగించిన ఉపాధ్యాయుడు జాడి మురళిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజవర్దన్‌ తెలిపారు. తన్విత ఆయుర్వేదిక్‌ స్కీంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశాడని జన్నారం మండలం పొనకల్‌కు చెందిన మామిడి నర్సయ్య ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
స్వగ్రామం చేరిన   మృతదేహం
1
1/2

స్వగ్రామం చేరిన మృతదేహం

స్వగ్రామం చేరిన   మృతదేహం
2
2/2

స్వగ్రామం చేరిన మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement