తర్జన భర్జన!
● వీఆర్వోలు, వీఆర్‌ఏల నాట్ విల్లింగ్!
● సుముఖంగా ఉన్నా ముగిసిన గడువు
● సద్వినియోగం చేసుకోని సగం మంది
మెదక్‌జోన్: రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తిరిగి మాతృసంస్థలోకి ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న ఉద్యోగులు వెబ్‌ఆప్షన్ పెట్టుకునేందుకు గతేడాది డిసెంబర్ 24 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అయితే 25, 26, 27 తేదీల్లో వరుసగా సెలవులు రాగా, మిగిలిన రెండు రోజుల్లో అతికొద్ది మంది మాత్రమే ఆప్షన్ పెట్టుకున్నారు. గడువు పెంచి మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా వీఆర్‌ఓలు 145 మంది ఉండగా, వీఆర్‌ఏలు 784 మంది కలిపి మొత్తం 929 మంది ఉన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేసిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను ఖాళీ ఉన్న చోట సర్దుబాటు చేశారు. అది సొంత జిల్లానా, లేక మరో జిల్లానా అని చూడ లేదు. దీంతో వారిలో 90 శాతం మంది అవస్థలు పడ్డారు. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సంబంధం లేని, అనుభవం లేని శాఖలోకి పంపడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సర్వేయర్‌గా అవకాశం
వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను విద్యా అర్హతలను బట్టి వీఎల్‌ఓగా, సర్వేయర్‌గా తిరిగి నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెబ్ ఆప్షన్ (గూగుల్) షీట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఏ శాఖలో పనిచేస్తున్నారు..? అందులో హోదా ఏమిటీ, విద్యా అర్హత, సొంత జిల్లా ఏది అనే వివరాలు అడిగారు. వీఎల్‌ఓగా పనిచేయాలనుకుంటే డిగ్రీ ఉత్తీర్ణత, సర్వేయర్‌గా చేయాలనుకుంటే ఇంటర్‌లో మ్యాథ్స్ సబ్జెక్టు ఉండాలని పేర్కొన్నారు. అలాగే గతంలో రెవెన్యూ శాఖ నుంచి వెళ్లే ముందు అప్పట్లో ఇచ్చిన బదిలీ సర్టిఫికెట్లతో పాటు ఒరిజనల్ ధ్రువపత్రాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. అయితే ఆప్షన్ ఇలా ఇచ్చి.. అలా తొలగించడంతో చాలా మందికి ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వీఆర్‌ఓలు 92 మంది, 232 మంది వీఆర్‌ఏలు కలిపి మొత్తం 324 మంది ఉద్యోగులు మాత్రమే వెబ్‌ఆప్షన్ పెట్టుకున్నారు.
వారం పాటు గడువు ఇవ్వాలి
మమ్ములను మాతృసంస్థలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. కానీ వెబ్ ఆప్షన్ ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు. అందులో మూడు రోజుల పాటు సెలవులు రాగా, మిగిలిన రెండు రోజుల్లో చాలా మందికి తెలియక వెబ్ ఆప్షన్ పెట్టుకోలేకపోయారు. మరో వారం పాటు గడువు ఇస్తే వివిధ శాఖలకు వెళ్లిన వారంతా తిరిగి మాతృసంస్థలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
– కిషన్, మాజీ వీఆర్‌ఓల సంఘం
జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment