కూడళ్లు మారవు.. కష్టాలు తీరవు
రామాయంపేట మున్సిపాలిటీలో తరచూ ప్రమాదాలు
రామాయంపేట(మెదక్): ప్రధాన కూడళ్ల విస్తరణ అభివృద్ధికి దిక్సూచి కాగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వాటి విస్తరణ విషయమై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇరుకుగా ఉన్న చౌరాస్తాల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రామాయంపేట– మెదక్ రూట్‌లో పోలీస్‌స్టేషన్ వద్ద, సిద్దిపేట రోడ్డు మలుపు వద్ద ప్రధాన కూడళ్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణ, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించకపోవడంతో రోడ్డు ఇరుకుగా మారింది. మెదక్ రూట్‌లో జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద నుంచి దళితకాలనీ వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేశారు. అయితే కూడళ్ల వద్ద ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఈవిషయమై పట్టణ ప్రజలు పలుమార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కూడళ్ల విస్తరణ చేపడుతామని, అందంగా, విశాలంగా తీర్చిదిద్ది అక్కడ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా సిద్దిపేట రోడ్డు మలుపు వద్ద ఉన్న కూడలి ప్రమాదాలకు నెలవుగా మారింది. మధ్యలో ఉన్న వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు ఇరుకుగా మారింది. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌ను వివరణ కోరగా.. కూడళ్ల విస్తరణ విషయమై గతంలోనే ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment